ప్రజాశక్తి -భీమునిపట్నం : అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎండిఒ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం మండల పరిషత్ సభ్యుల సాధారణ సమావేశం నిర్వహించారు. ఎంపిపి దంతులూరి వెంకటశివసూర్య నారాయణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఫిర్యాదులతో నిమిత్తం లేకుండా ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్ వైర్లను గుర్తించి, వాటిని సరి చేయాలని ఎపిఇపిడిసిఎల్ అధికారులకు సూచించారు. విద్యుత్ వైర్ల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అందరికీ ఇళ్లు పథకం కింద మంజూరైన స్థలాల్లో నిర్ణీత సమయంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. జెడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు మాట్లాడుతూ, కార్యాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపిపిలు బోని బంగారు నాయుడు, సురపతి దుర్గాలమ్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ పెదబాబు, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్యనారాయణ, ఆర్‌డిఒ ఎస్.భాస్కరరెడ్డి, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఎండిఒ పి.వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










