May 23,2023 22:44

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా


ప్రజాశక్తి -కాకినాడ
కాకినాడ జిల్లా పరిధిలో భారత్‌మాల కింద మంజూరైన పనులను ప్రణాళికాయుతంగా చేపట్టి, వేగవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సూచించారు. భారత్‌మాల పరిధిలోని జాతీయ రహదారుల పనులపై మంగళవారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో కలెక్టర్‌ కతికా శుక్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌తో కలిసి జాతీయ రహదారులు, రెవెన్యూ, మునిసిపల్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌, గ్రామీణ నీటి సరఫరా, పరిశ్రమలు, పర్యాటకం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రణాళికల్లో భాగంగా అచ్చంపేట జంక్షన్‌ నుంచి యాంకరేజ్‌ పోర్టు వరకు మంజూరైన దాదాపు 13 కి.మీ. నాలుగు లైన్ల జాతీయ రహదారి ప్రాజెక్టుపై చర్చించారు. డ్రెయిన్ల అవుట్‌లెట్లు, కల్వర్టులు, పైవంతెనలు, రైల్వే క్రాస్‌లు, అప్రోచ్‌ రహదారులు, పైపులైన్లు తదితరాలకు సంబంధించిన వివరాలను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. భవిష్యత్తులో కాకినాడ గ్రామీణం, పట్టణ ప్రాంతాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా, సమస్యలు ఎదురుకాకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి నిర్మాణానికి అనుగుణంగా విద్యుత్‌ స్తంభా లను షిఫ్టింగ్‌ చేయాలన్నారు. డ్రెయిన్‌ వ్యవస్థ సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నీరు ఎక్కడా నిలిచి పోకుండా చూడాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఇందుకు సంబంధించిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జాతీయ రహదారి ప్రాజెక్టు పనులు సజావుగా జరిగేందుకు ఎప్పటికప్పుడు సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కతికా శుక్లా తెలిపారు. సమావేశంలో ఆర్‌డిఒ బివి రమణ, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ డి.సురేంద్ర నాథ్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం టి.మురళి, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు, డిఎఫ్‌ఒ ఐవికె రాజు, కార్పొరేషన్‌ఎస్‌ఇ సత్యకుమారి, కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ పివి.సీతాపతిరావు, కాకినాడ రూరల్‌ తహశీల్దార్‌ వి.మురార్జీ తదితరులు పాల్గొన్నారు.