Jul 23,2023 00:39

ప్రజాశక్తి-కాకినాడ అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల ఫలాలను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ విధానగౌతమి సమావేశ మందిరంలో కాకినాడ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి అప్పలరాజు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ అర్బన్‌ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్‌ డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకాలు, అభివద్ధి కార్యక్రమాల అమలుతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆకాంక్షల మేరకు లక్ష్యాలను పూర్తి చేసేందుకు వీలుగా ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 33.50 లక్షలు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసినట్టు తెలిపారు. ఒక్క కాకినాడ అర్బన్‌ నియోజకవర్గం పరిధిలోనే 30 వేల పట్టాలు ఇచ్చినట్టు తెలిపారు. వివరించారు. సెంటు జాగా కూడా దొరకడం కష్టమైన ఈ ప్రాంతంలో 650 ఎకరాలను సేకరించి మరీ లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరి, ఎపిత్రయం లేఅవుట్లలో గ్రౌండ్‌ అయిన 16,621 ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రూ.978 కోట్లతో స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద చేపట్టిన 71 ప్రాజెక్టుల్లో 52 ఇప్పటికే పూర్తయినందున మిగిలిన వాటి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కళాక్షేత్రం, సైన్స్‌ సెంటర్‌, స్కేటింగ్‌ రింక్‌ తదితరాలకు సంబంధించి చివరిదశలో ఉన్న పనులను మిషన్‌ మోడ్‌లో పూర్తి చేయాలన్నారు. ఈ జిల్లాకు ఇన్‌ఛార్జ్‌ మంత్రి కావడం తన అదృష్టమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న, ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ, సిపిఒ పి.త్రినాథ్‌ పాల్గొన్నారు.