ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సినీ తారలపై ప్రేక్షకుల అభిమానం పలురకాల్లో ఉంటుంది. సినీ నటులను విపరీతంగా ప్రేమించే అభిమానులు తమ ప్రేమను చాటుకోవడానికి పలు మార్గాల్లో తమ ప్రయత్నాలు చేస్తారు. హీరోలు, హీరోయిన్ల కోసం ఏమైనా చేస్తారు అభిమానులు. తమ అభిమాన తారల కోసం అభిమానులు గుడి కడతారన్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికీ పలువురికి గుడి కట్టారు వారి అభిమానులు. ఇప్పుడు ఆ జాబితాలోకి స్టార్ హీరోయిన్ సమంత చేరిపోయింది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసిన సమంత. మొదటి సినిమాతోనే మంచి అభిమానాన్ని పొందింది. సమంత వీరాభిమాని ఒకరు ఆమెకు గుడి కడుతున్నాడు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, నయనతార, హన్సిక, నిధి అగర్వాల్, నమితకు వారి అభిమానులకు గుడి కట్టారు. ఇప్పుడు ఆ హీరోయిన్ల జాబితాలోకి సమంత చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. ఆమె మయోసైటిస్ బారిన పడినప్పుడు కోలుకోవాలంటూ తిరుపతి, చెన్నై, నాగపట్నంలలో మొక్కుబడి యాత్ర చేశాడు. ఇప్పుడు ఆలపాడులోని తమ సొంత ఇంట్లో సమంత కోసం అతను గుడి కడుతున్నాడు. ప్రస్తు తం గుడి నిర్మాణ పనులు పూర్తికావ చ్చాయి. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు. ఆరోజుకు ఈ గుడి నిర్మాణ పనులు పూర్తిచేసి అదేరోజున గుడిని ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఏపీలో గుడి కట్టించుకున్న తొలి హీరోయిన్‌గా సమంత నిలిచినట్లయింది.










