ప్రజాశక్తి-ఉరవకొండ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను వేగవంతంగా నింపకపోతే తాగునీటి కష్టాలు తప్పవని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నింబగల్లు గ్రామ సమీపంలో ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్‌లకు నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉరవకొండతోపాటు వివిధ గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోకి హెచ్‌ఎల్‌సి జలాలను పంపింగ్ చేసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. నవంబర్ 10వ తేదీకి హెచ్‌ఎంసికి నీటిని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఎస్‌ఎస్ ట్యాంకుల్లోకి నీటిని పంపింగ్ చేసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఇప్పటి వరకూ పంపింగ్ చేసుకున్న నీరు కేవలం డిసెంబర్ వరకూ మాత్రమే సరిపోతుందని, వేసవిలో తాగునీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని నిలదీశారు. ప్రస్తుతం కాలువలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఉరవకొండలో 12 రోజులకు ఒకసారి నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారని, ఇక వేసవికాలంలో ఏవిధంగా నీటిని అందిస్తారని ప్రశ్నించారు. గత టిడిపి ప్రభుత్వంలో ఉరవకొండలో రోజు విడిచి రోజు తాగునీరు అందించే వారమని గుర్తు చేశారు. ప్రస్తుతం 15 రోజులుకు ఒక్కసారి కూడా అందించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు నీటి పంపింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ అంజుమన్ సుప్రీన్‌తో సంబంధిత అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్










