ప్రజాశక్తి- అరకు లోయ, అనంతగిరి:
అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించేది లేదని ఎపి టూరిజం కార్మికులు తేల్చి చెప్పారు. సమ్మెతో అరకులోయలోని మయూరి హరిత రిసార్ట్, హరిత వ్యాలీ రిసార్ట్, అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు, టైడా జంగిల్ బెల్స్, అనంతగిరి హరిత హిల్ యూనిట్లు మూతపడ్డాయి.తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ టూరిజం కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారంతో మూడో రోజుకు చేరింది. సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఈనెల 15న ఏపీ గవర్నర్ అరకులోయ పర్యటన ఖరారు కావడం, పర్యాటక శాఖ అతిథి గృహాలు రెస్టారెంట్లు మూతబడి ఉండడంతో అధికారులు ఉరుకుల పరుగులు తీస్తున్నారు. టూరిజం కార్మికులు అధికారుల మాయమాటలను నమ్మడం లేదు. గవర్నర్ వచ్చినా సమ్మె కొనసాగించి తీరుతామని వారు స్పష్టం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వర్కర్లను తీసుకొచ్చి పనులు చేయిస్తామని కొందరు అధికారులు బెదిరింపులకు పాల్పడినప్పటికీ కార్మికులు తిప్పికొట్టారు. అరకులోయలోని హరిత వ్యాలీ రిసార్ట్సలోని సమ్మె శిబిరంను ఐటిడి పీఓ అభిషేక్ సందర్శించారు.తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే టూరిజం యాజమాన్యంతో చర్చించి పరిష్కరించాలని పాడేరు ఐటిడిఏ పిఓపి కార్మికులు కోరడంతో పాటు వినతిపత్రం సమర్పించారు.అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారు. అనంతగిరిలోని కార్మికులు థింసా నృత్యాలతో నిరసన చేపట్టారు. ఈ సమ్మెకు జెడ్పిటిసి గంగరాజు, పంచాయతీల సర్పంచులు మోస్య, అప్పారావు, సిపిఎం మండల కార్యదర్శి ఎస్ నాగులు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి దేవుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.సమ్మె శిబిరం వద్ద కళారూపాలు, థింసా నృత్యం ప్రదర్శిస్తూ కార్మికులు తమ సమస్యలను అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని టూరిజం కార్మికులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.