Nov 01,2023 22:22

సమ్మెతో నిలచిన క్లాప్‌ వాహనాలు

ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో ఇంటింటి చెత్త సేకరణ కార్మికుల సమ్మెతో బుధవారం నుంచి చెత్త సేకరణ స్తంభించింది. 5 నెలల నుంచి ఏజెన్సీ నిర్వహకులు క్లాప్‌ ఆటో డ్రైవర్లకు వేతనాలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన డ్రైవర్లకు న్యాయం జరగలేదు. దీంతో చెత్త సేకరణను ఆపి ఆటో డ్రైవర్లు సమ్మె సైరన్‌ మోగించారు.
క్లీన్‌ ఆంధ్రప్రదేశలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరణ కోసం క్లాప్‌ వాహనాలను తీసుకువచ్చింది. 2022 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి చెత్త సేకరణ ప్రారంభించింది. ఈ వాహనాలకు డ్రైవర్లను నియమించింది. ఒక్కొక్క వాహన డ్రైవర్‌కు రూ. 18,500లు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి విధుల్లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో హిందూపురం పట్టణానికి 25 వాహనాలు కేటాయించింది. మొదటి నెల డ్రైవర్‌కు రూ. 8700లు ఇచ్చారు. ఈ ఏడాది నుంచి నెలకు రూ. 10,118లు చెల్లిస్తున్నారు. మిగిలిన రూ. 8వేలు ఎక్కడికి వెళుతోందో తెలియడం లేదు. ఈ సొమ్ము ఏజెన్సీ కాంట్రాక్టర్‌ జేబులోకి వెళుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్లు తమ వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ గురించి అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. హిందూపురం పురపాలక సంఘానికి కేటాయించిన 25 వాహనాల నిర్వహణ బాధ్యతను కడప జిల్లాకు చెందిన రెడ్డి ఎంటర్‌ ప్రెజేస్‌ వారికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ వాహనాలతో ప్రతి రోజు అధికారులు సూచించిన ప్రాంతాల్లో ఇంటింటి చెత్త సేకరణ చేపడుతున్నారు. అయితే ఆరునెలలుగా సిబ్బంది ఇవ్వాల్సిన వేతనాలు ఏజెన్సీ నిర్వహకులు ఇవ్వలేదు. దీంతో క్లాప్‌ డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లారు. వీరి సమ్మెతో పురపాలక సంఘాల్లో చెత్త సేకరణ నిలచి పోయింది.