Sep 13,2023 23:47

గాజువాకలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కాంట్రాక్టు వర్కర్లు

ప్రజాశక్తి -యంత్రాంగం
గాజువాక :
జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఈ నెల 16వ తేదీన చేపట్టే సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గాజువాక జోన్‌ కమిటీ అధ్యక్షులు గొల్ల రాము మాట్లాడుతూ, సమ్మెకు సిద్ధమైనప్పుడు కార్మిక నాయకులకు జివిఎంసి అధికారులు మాయమాటలు చెప్పి ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి సానుకూల పరిస్థితి కల్పించటం లేదన్నారు. వినాయక చవితి ముందు సమ్మెకు సిద్ధమవుతున్నామని తెలిపారు. యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.గణేష్‌ మాట్లాడుతూ, మినిట్స్‌ ఒప్పందం నెరవేరని కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పారు. గాజువాక జోన్‌ కమిటీ బాధ్యులు గొలగాని అప్పారావు మాట్లాడుతూ, కార్మికుల వారసత్వ పోస్టులు కార్మికుల పిల్లలకే ఇవ్వాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.18500 జీతం, నీటి సరఫరా, యుజిడి కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, వేతనాలు అమలు చేయాలని, ఎంఎస్‌ఎఫ్‌ డ్రైవర్ల, మలేరియా, యుజిడి వెటర్నరీ, పార్కు కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, సిబ్బందిని పెంచాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : సమ్మె సన్నాహాల్లో భాగంగా జివిఎంసి 30వ వార్డు పారిశుధ్య కార్మికుల సమావేశం జరిగింది. జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు టి.నూకరాజు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించనందునే సమ్మెకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ నెల 16 నుంచి జరిగే సమ్మెలో నీటి సరఫరా కార్మికులు కూడా పాల్గొంటున్నారన్నారు. సమావేశంలో వార్డు కమిటీ సభ్యులు కె.అనిత, జయ, నూకాలమ్మ, శశిరేఖ పాల్గొన్నారు.