Jul 31,2023 21:04

సమ్మె నోటీసు అందజేస్తున్న స్ట్రగుల్‌ కమిటీ నాయకులు

ఎర్రగుంట్ల : ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ ఈనెల 10 నుంచి నిర్వహించబోయే సమ్మెకు సంబంధించిన నోటీసును నాయకులు ఆర్‌టిపిపి ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ కె. సోమశేఖర్‌రెడ్డికి సోమవారం అందజేశారు. ఈ సం దర్భంగా స్ట్రగుల్‌ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బిరెడ్డి, కన్వీనర్‌ పి .శివయ్య మాట్లాడుతూ ఎపి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కామ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిస్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 2 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, ఆగష్టు 10 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించే వాతావరణం కనబడలేదని మండిపడ్డారు. వేతన సవరణ గడువు ముగిసి 16 నెలలు దాటినా ఇప్పటివరకు కొత్త వేతన సవరణ ప్రకటించలేదని పేర్కొన్నారు. విద్యుత్‌ ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చివరకు ఒకటో తారీఖున వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎప్పుడు అందుతాయో అంటూ ఉద్యోగులు ఎదురు చూడాల్సిరావడం దారు ణమన్నారు. ఆదివారం వేతన సవరణ చర్చలకు యాజమాన్యం పిలిచి, ఏకపక్షంగా వాయిదా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పట్ల యాజమాన్యానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్య మంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులందరికీ పర్మినెంట్‌ చేయాలని, ఇపిఎఫ్‌ కింద ఉన్న ఉద్యోగులందరినీ జిపిఎఫ్‌కి మార్పు చేసి పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని, చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు, కార్మికులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్ట్రగుల్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వి .గంగయ్య, ఉద్యోగ సంఘ నాయకులు కొండా రెడ్డి, వెంకట స్వామి, హరి ఓబుల రెడ్డి, గిరిబాబు, గంగాధర్‌, రమెష్‌ , వెంకట్‌, కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు చంద్ర శేఖర్‌, పుల్లారెడ్డి, సాంబశివరెడ్డి, వెంకట రమణ పాల్గొన్నారు.