Jul 08,2023 23:39

రైతులకు విత్తనాలు, జీవన ఎరువులు అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అనకాపల్లి
అన్ని శాఖల సమన్వయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమిష్టి కృషితోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమని ఆచార్య ఎన్జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ పివికె.జగన్నాధరావు అన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం జరిగిన రైతు దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా కూలీల కొరతను అధిగమించడం ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని చెప్పారు. అధిక ఖర్చుతో కూడిన వ్యవసాయ యంత్రాలను రైతాంగం సమిష్టిగా మాత్రమే సొంతం చేసుకోగలరని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్‌, రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల పాత్ర కీలకం కానుందన్నారు. ప్రభుత్వాలు, బ్యాంకులు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని అందుకొని వ్యవసాయ మార్కెటింగ్‌లో రైతులు బలోపేతం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు వివిధ పంటల యాజమాన్యాలపై వివరించారు. ముందుగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అభ్యుదయ రైతులకు వరి, చోడి, జీవన ఎరువులను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ ముకుందరావు, కెవి రమణమూర్తి, ఆదిలక్ష్మి, విశాలాక్షి, రామలక్ష్మి, కుసుమ, చంద్రశేఖర్‌, శిరీష, రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.