Mar 03,2023 01:06
సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ సరోజిని, చిత్రంలో సింగరకొండ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కోటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అద్దంకి: అందరూ సమిష్టి కృషి చేస్తే తిరునాళ్ల విజయవంతం అవుతుందని చీరాల ఆర్‌డిఒ సరోజిని పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సింగరకొండ తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో చీరాల ఆర్‌డిఒ సరోజిని గురువారం అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయ వంతం చేయాలని కోరారు. డిఎస్‌పి శ్రీకాంత్‌ మాట్లాడుతూ తిరునాళ్లకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరునాళ్ల రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌ నుంచి అద్దంకి వైపు వచ్చే వాహనాలను నరసరావుపేట వైపునకు, మేదరమెట్ల వైపు నుంచి అద్దంకి వైపు వచ్చే వాహనాలను కొరిశపాడు ఎన్‌ హెచ్‌ 16 రోడ్‌ వైపునకు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ప్రభలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకుల పూర్తి ఆధారాలను పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని ప్రభలపై ఎలాంటి పార్టీలకు సంబంధిన ఫ్లెక్సీలు, పాటలు ఉండరాదని అన్నారు. పబ్లిక్‌ ప్రదేశాలు, ప్రభల వద్ద బాణ సంచాలు కాల్చరాదని, డప్పు వాయిద్యాలు వాయించరాదని తెలిపారు. ముఖ్యంగా ప్రభలపై అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించరాదని, అలా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌ ఈఈ మస్తాన్‌రావు మాట్లాడుతూ తిరునాళ్ల మూడు రోజులు విద్యుత్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సిఐ రోశయ్య మాట్లాడుతూ తిరునాళ్లలో ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌పై ప్రత్యేక టీమ్‌లతో పోలీస్‌ నిఘా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరునాళ్లకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం సింగరకొండపాలెం వైపు ఒక పార్కింగ్‌, 99 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహానికి దక్షిణం వైపు నామ్‌ రోడ్‌కు ఇరువైపులా రెండు పార్కింగ్‌లు, సింగరకొండ పాలెం వైపు ఒక పార్కింగ్‌ మొత్తం 4 పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్కింగ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను కోరారు. ఈ సమన్వయ సమావేశంలో దర్శి మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రావు, అబ్కారీ శాఖ ఎస్‌ఐ శ్రీనివాసరావు, విద్యుత్‌ శాఖ అధికారులు, ఎస్‌ఐలు, అగ్నిమాపక శాఖ అధికారులు, ఆర్‌ డబ్ల్యుఎస్‌ అధికారులు, రవెన్యూ అధికారులు, ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మి నృసింహ స్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారి టి సుభద్ర, కోటిరెడ్డి, చైర్మన్‌లు కోట శ్రీనివాస్‌ కుమార్‌, ఎన్‌ కొండలు, ఐఅండ్‌ఆర్‌ అధికారి రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.