Aug 19,2023 21:38

మాట్లాడుతున్న ఎస్‌పి

మాట్లాడుతున్న ఎస్‌పి
సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన
ప్రజాశక్తి-నెల్లూరు:ప్రభుత్వ విభాగాలన్ని సమన్వయంతో ప్రత్యేక చర్యలతోనే జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమౌతుందని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పేర్కొన్నారు. శనివారం ఎస్‌పి కార్యాలయంలో ఎన్‌సిఒఆర్‌డి సమన్వయ సమావేశం నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి, కమిటి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక శ్రద్ద కనపరచాలని, జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. డార్క్‌ స్పాట్స్‌ ను గుర్తింపు, శివారు ప్రాంతాలు ఆయా ప్రదేశాలలో లైటింగ్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో పోలీస్‌ బీట్‌ వ్యవస్థ బాగుందని అభినందించి, డార్క్‌ స్పాట్స్‌, హాస్టల్స్‌ ను సందర్శించాలని సూచనలు చేశారు. సముద్ర మార్గాల ద్వారా గంజాయి అక్రమరవాణా అరికట్టుటకు ఆయా విభాగాలు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి లగేజ్‌, పార్సిల్‌ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఎస్‌పి మాట్లాడుతూ నెల్లూరు, కావలి మున్సిపల్‌ పరిధిలో 34 డార్క్‌ స్పాట్స్‌ గుర్తించినట్లు, తగిన ఏర్పాట్లు పూర్తి చేసి ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎన్‌సిఒఆర్‌డి ప్రత్యేక వాట్స్‌ యాప్‌ గ్రూప్‌ ద్వారా మరింత సమన్వయంతో గంజాయి, మత్తు పదార్దాల నిర్మూలనకు సత్వర చర్యలకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.గంజాయి అక్రమ రవాణా చేసేవారు, రిసీవ్‌ చేసుకునే వారితో పాటు లోకల్‌ పెడ్లర్స్‌ గుర్తించాలని, పెడ్లర్స్‌ కు లింకై ఉన్న నిందితులను, సేవించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. టీనేజ్‌ లోనే డ్రగ్స్‌ బారిన పడిన వారికి డి-ఎడిక్షన్‌ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్‌ ఇచ్చి వారిలో పరివర్తన తీసుకురాలన్నారు.అనంతరం అడిషనల్‌ యస్‌.పి.(అడ్మిన్‌) గంజాయి విక్రయ, అక్రమ రవాణాను చేధించి కేసుల నమోదు, ముద్దాయిల అరెస్ట్‌, స్వాధీనం చేసుకున్న వివరాలు, అరికట్టేందుకు చేపడుతున్న ప్రణాళికలను పిపిటి ద్వారా వివరించారు. జిల్లా వ్యాప్తంగా కూడలి ప్రాంతాలలో హౌర్డింగ్స్‌, ఫ్లెక్సీలు ఏర్పాటు స్కూల్స్‌, కళాశాలలో 183 డ్రగ్‌ అబ్యూజ్‌ ప్రివెన్షన్‌ కమిటీలు ఏర్పాటు చేసి, 408 విద్యాసంస్థలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం ఎన్‌సిఒఆర్‌డి కమిటీ స్టేక్‌ హౌల్డర్స్‌ మాట్లాడుతూ వారివారి సలహాలు, సూచనలు తెలిపారు.ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఎం.పెంచలయ్య, జిల్లా ఎస్‌సి వెల్ఫేర్‌, జిల్లా విద్యాశాఖ అధికారిణి, టెర్రీటోరియల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ కందుకూరు, జెడి అగ్రికల్చర్‌, జాయింట్‌ కమీషనర్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ కమాండెంట్‌, ఆర్‌డిఓ, క్రిష్ణపట్నం పోర్టు సిఈఒ, ఇంటలిజెన్స్‌ అధికారులు, జిల్లా ఎస్‌ఈబి అధికారులు, సబ్‌ డివిజన్‌, సర్కిల్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు.