ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో రెండు జిల్లాల్లో నేతలు జనంబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రవేశించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర రాజకీయాలను వేడెక్కిస్తోందని చెప్పొచ్చు. వామపక్షాలు ప్రజాసమస్యలపై వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తుండగా అధికార పార్టీ వైసిపి మాత్రం నియోజకవర్గాలవారీ మంత్రులు, జిల్లా అధికారుల ఆధ్వర్యాన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తమ ప్రజాప్రతినిధులు, నేతల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలోకి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. అనూహ్యంగా మొదటి రోజే నూజివీడు నియోజకవర్గం తుక్కులూరులో వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయపార్టీలు యాత్రలు వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆయా ప్రాంతాల సమస్యలు తెలుసుకోవడం, తమ పార్టీ విధానాలు చెప్పి, ఆయా సమస్యల పరిష్కారానికి కొన్ని హామీలు ఇవ్వడం సర్వసాధారణం. ఆ తర్వాత ప్రత్యర్థులు ఆ నేతల వ్యాఖ్యలను ఖండించేవారు. ప్రస్తుతం దానికి భిన్నంగా ఒక పార్టీ యాత్ర చేస్తుంటే ప్రత్యర్థి పార్టీ కవ్వింపు చర్యలకు దిగడం షరా మామూలైపోయింది. దీనికితోడు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు కొరవడటం సమస్యను జఠిలం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. తుక్కులూరులో వైసిపి శ్రేణులు తమ పార్టీ జెండా ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడటం, టిడిపి యువగళం టీమ్ దీనిపై దూకుడుగా స్పందించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ముందుగానే వైసిపి శ్రేణులను పోలీసులు నిలువరించి ఉంటే ఈ ఘర్షణ చోటుచేసుకునేది కాదని పరిశీలకుల అంచనా. అదే సమయంలో రాజకీయ పార్టీల నేతలు సైతం తమ విధానాలను చెప్పుకుని జనాన్ని ఆకట్టుకుని ఎన్నికల్లో గెలవాలి తప్ప ప్రత్యర్థుల నోరునొక్కి తాము అధికారంలోకి రావాలనుకుంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయనేది బహిరంగ రహస్యం. ఇప్పటికైనా అధికార పార్టీ కవ్వింపు చర్యలు మాని యాత్రల సందర్భంగా తెరపైకి వస్తున్న అంశాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటే తమకే సానుకూల ఫలితాలు ఉంటాయనేది అందరి భావన. దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘర్షణలు పునరావృతమై ప్రభుత్వానికి, ఇటు అధికారులకు చెడ్డ పేరొస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
ఇక సిపిఐ బస్సు యాత్ర పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల మీదుగా సాగింది. ఏలూరు, జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం, బహిరంగ సభల్లో పోలవరం నిర్వాసితులు, పోలవరం ప్రాజెక్టు పనులు చర్చనీయాంశమయ్యాయి. 'పోలవరం పోరుకేక' పేరిట సిపిఎం పాదయాత్ర నిర్వహించినప్పటి నుంచి నిర్వాసితుల అంశం తెరపైకి వస్తుందనేది మరోసారి రుజువైంది. ఇతర పక్షాల నేతలు సైతం పోలవరం పనులు వేగవంతం చేయాలనడంతోపాటు దీనికోసం సర్వస్వం వదులుకుంటున్న నిర్వాసితుల సంరక్షణ బాధ్యత పాలకులపై ఉందని నొక్కిచెప్పడమే దీనికి నిదర్శనం. అయితే అధికారపక్షాలైన వైసిపి, బిజెపి ఏలూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి రాలేదు.
సిపిఎం స్థానిక సమస్యలపై తన పోరు కొనసాగిస్తూనే ఉంది. రోడ్లు, భూములు తదితర సమస్యలపై రెండు జిల్లాల్లోనూ తన పోరు సాగిస్తోంది. పాదయాత్రలు, ధర్నాలు, మోటారు సైకిల్ ర్యాలీలు నిర్వహించి అధికారులను కదిలిస్తోంది. దీంతోపాటు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు సైతం ఆయా కార్మికుల, ప్రజల సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో సిఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తమదైన శైలిలో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
మొత్తంగా అటు టిడిపి మహాశక్తి, యువగళం పాదయాత్రలతో టిడిపి జనం వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా జనసేన స్థానికంగా ఏదోక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటు వామపక్షాలు ప్రజా సమస్యల గొంతుకగా నినదిస్తున్నాయి.
అధికార వైసిపి గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష పేరిట జనం వద్దకు వెళ్లగా తాజాగా నియోజకవర్గాల సమీక్ష పేరిట అటు ప్రజాప్రతినిధులు, తమ నేతలు, జిల్లా అధికారుల సమక్షంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంకా ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ఏం చేయగలం అనేది చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించడం వల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, సంస్థలు అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లే అవకాశం ఉండటం లేదు. పైగా సమస్య పరిష్కరించినా తమకు పెద్దగా ఓట్లు పడవని గుర్తించిన ప్రాంతాలను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాసమస్యల పరిష్కారంలోనూ ఓటుబ్యాంకు రాజకీయాలేమిటీ అని పలువురు పెదవివిరుస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లోనే సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. ఉదయం వినతులు స్వీకరించి, మధ్యాహ్నం నుంచి సమీక్షలు పెడితే ఎంతోకొంత ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా అటు యాత్రలు, ఆందోళనలు పేరిట ప్రతిపక్షాలు, ఇటు సమీక్షల పేరిట అధికార వైసిపి నేతల హడావుడితో జిల్లా రాజకీయం వేడెక్కిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










