ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో రాజ్యసభ సభ్యులు, వైసిపి కోస్తా జిల్లాల కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి రెండ్రోజులుగా నిర్వహించిన అంతర్గత సమీక్షలు గురువారం ముగిశాయి. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల మధ్య పొరపొచ్చాలేమీ లేవని, రానున్న ఎన్నికల్లో పల్నాడులోని ఏడు నియోజకవర్గాల్లో తిరిగి వైసిపి జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఎ1 కన్వెన్షన్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. సమీక్షలు ఇంతటితో అయిపోలేదని, ప్రతి నియోజకవర్గంలో, మండలంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారధులతో సమన్వయ లోపాలుంటే సరిచేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. వైసిపి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నాయకులు, ప్రజాప్రతినిధులకు ఉన్న భిన్నాభిప్రాయాలను సరిచేసి ఏకాభిప్రాయం సాధించడం కోసమే సమీక్షలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి 24 లేదా 25 ఎంపీ స్థానాల సాధించడంతోపాటు గతంలో సాధించిన 151 సీట్లకు డోకా ఏమీ ఉండదని జాతీయ స్థాయిలో నిర్వహించి సర్వేల్లో తేలిందని, వైసిపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేశ్.. రెడ్‌బుక్‌లో అందరి పేర్లూ రాస్తున్నానని, ప్రతి ఒక్కరి అంతు తేలుస్తానని అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని, ముందు టిడిపి అధికారంలోకి రావాలి కదా? అని అన్నారు. కొడతాం, తిడతాం, అంతు చూస్తాం.. అంటే ప్రజలు ఓట్లు వేయరని, టిడిపి హయాంలో చేసిన మంచి ఏమైనా ఉంటే చెప్పుకుంటూ ఇంకా మంచి చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాలేగాని ఇటువంటి సంసృతి పనికిరాదన్నారు. టిడిపి ఒక సంఘ విద్రోహ పార్టీ అని, రౌడీలు, గుండాలు ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు. ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు పరిస్థితి అయన చెబుతున్న విజన్-2047 నాటికి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఎద్దేవ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 66 పంచాయతీలకు ఉపఎన్నికలు జరిగితే 53 స్థానాలను వైసిపి కైవసం చేసుకుందని, టిడిపి 10, టిడిపి - జనసేన పొత్తు ద్వారా 3 స్థానాల్లోనే గెలిచారని, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్న ప్రాంతంలో కూడా వార్డు మెంబర్ వైసిపి గెలిచారని అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఋషికొండలో కడుతున్న భవనాలను పడగొడతామని లోకేష్ చెప్పడం అంటే ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ది అసూయ, ద్వేషంతో కూడిన పిరికితనమని, చంద్రబాబు వంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు. మంత్రి రజినిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానంటూ వచ్చిన వార్తలను విజయసాయిరెడ్డి ఖండించారు. పల్నాడులో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లకు అభ్యర్థులను మారుస్తారా? అని విలేకర్లు ప్రశ్నించగా వారి పనితీరు బ్రహ్మాండంగా ఉందని, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అ ఆ నిర్ణయం పూర్తిగా అధిష్టానం తీసుకుంటుందని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నికల కమిషన్ సిఫార్సులు మేరకే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, జిడిసిసి బ్యాంక్ చైర్మన్ ఆర్.సీతారామాంజనేయులు, పాల్గొన్నారు.










