Nov 02,2023 22:53

పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

* ఎస్‌పి జి.ఆర్‌ రాధిక
ప్రజాశక్తి - నరసన్నపేట: 
సమగ్రంగా కేసుల దర్యాప్తు చేపట్టాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌ను అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనాతో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు. గత నెలలో నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు. పోలీస్‌ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, బోర్డర్‌ పోలీసు స్టేషన్లు, కేసుల నమోదు, దర్యాప్తు తదితర వాటిని నరసన్నపేట సిఐ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు వివరించారు.
హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి చెక్కు అందజేత
ఎచ్చెర్ల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఎం.లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్‌పి నగదు చెక్కును అందజేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ సతీమణి ఎం.జ్యోతి, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆడిషనల్‌ విడో, ఫ్లాగ్‌ ఫండ్‌ రూపంలో రూ.75 వేల చెక్కును అందజేశారు. పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. మిగిలిన ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, పరిపాలనాధికారి సిహెచ్‌.గోపీనాథ్‌, ఆర్‌ఐ డి.సురేష్‌, బి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వై.లిల్లీభారు పాల్గొన్నారు.