
ప్రజాశక్తి - ఏలూరు
కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ (ఇఎస్‌జెడ్) సరిహద్దుల నిర్ధారణ కోసం సమగ్రమైన ప్రతిపాదనలు సిద్ధ చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశపు హాలులో సోమవారం కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ (ఇఎస్‌జెడ్) సరిహద్దుల నిర్ధారణ ప్రతిపాదనలకు ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం కొల్లేరు ప్లస్ కాంటూరుకు పైన పది కిలోమీటర్ల పరిధి వరకూ ఏకో సెన్సిటివ్ జోన్ (ఇఎస్ జెడ్) సరిహద్దుల నిర్ధారణకు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటుచేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. ఇఎస్ జెడ్ సరిహద్దుల ప్రాథమిక లక్ష్యం.. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ కొన్ని కార్యకలాపాలను నియంత్రించడం, తద్వారా రక్షిత ప్రాంతాన్ని ఆవరించిఉన్న పర్యావరణ వ్యవస్ధ కార్యకలాపాలకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలను తగ్గించడమేనన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ (ఇఎస్‌జెడ్) ప్రాంత నిర్థారణ పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ అధ్యక్షులుగా, అటవీ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ట్రాన్స్‌కో, రెవెన్యూ, పంచాయతీ, మత్స్య శాఖ, వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, భూగర్భ జలాలు, మున్సిపల్, పర్యావరణ, పరిశ్రమలు, సర్వే, స్వచ్ఛంద సంస్థలు, తదితరులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారణలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతికూలతలు లేకుండా చూస్తారన్నారు. గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు సంబందించి సవివరమైన షెడ్యూల్‌ను తయారుచేసి, సంబంధిత గ్రామాల ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామ సభల్లో వచ్చే సూచనలు, అభ్యంతరాలను తప్పనిసరిగా నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. విజయవాడలోని బుడమేరు వ్యర్థాలు కొల్లేరులో కలిసి కలుషితం చేస్తున్నాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కొల్లేరు పరిసర ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను, వారి పరిశ్రమల విస్తరణకు సంబంధించి వివరాలను సమావేశంలో తెలియజేశారు.
కార్పొరేట్ సామజిక బాధ్యత నిధులు చెల్లించండి
పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి
జిల్లాలోని అన్ని పరిశ్రమలకు సంబంధించి వారి నికర ఆదాయంలో రెండు శాతంను కార్పొరేట్ సామజిక బాధ్యత (సిఎస్‌ఆర్) నిధుల కింద జమ చేయాల్సి ఉందని, ఈ దిశగా సంబంధిత పరిశ్రమలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రతీకార్పొరేట్ సంస్థ తమ నికర లాభంలో రెండు శాతంను ఆయా జిల్లాల్లో పలు సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందించాల్సి ఉందన్నారు. జిల్లాలో కొన్ని కార్పొరేట్ సంస్థలు సిఎస్‌ఆర్ కింద అందించిన నిధులతో పలు చర్యలు చేపట్టామని, సర్వారాయ కంపెనీ వారు అందించిన నిధులతో భీమడోలు నుండి ద్వారకాతిరుమల వరకు రోడ్డు సెంట్రింగ్ సుందరీకరణ పనులు చేశామని తెలిపారు. అదే విధంగా మిగిలిన కార్పొరేట్ సంస్థల వారు కూడా ప్రతిపాదనలతో రావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యావరణ శాఖ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఏసుదాసు, అటవీ శాఖాధికారి ఎస్‌వికె. కుమార్, వివిధ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.