
ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 15న విజయవాడలో సిపిఎం నిర్వహించే చేపట్టిన ప్రజా రక్షణభేరి సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజారక్షణ భేరి ప్రచారాన్ని నల్లచెరువు, ఎల్‌ఆర్ కాలనీ, బావోజీ నగర్, డిఎస్ నగర్, పట్నం బజార్, సుద్దపల్లి డొంక, బాలాజీ నగర్, పాతగుంటూరు ఏరియాలలో చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అదానీ, అంబానీలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసే చట్టాన్ని రద్దు చేసి, పేద, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం మోపారని విమర్శించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్.అరుణ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ, రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయటంలో మోసం చేసిన బిజెపి పట్ల రాష్ట్రంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షాలు అనుకూల వైఖరి రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. ప్రజారక్షణ భేరి బహిరంగ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యవక్తగా పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, నాయకులు బి.ముత్యాలరావు, షేక్.బాషా, ఎం.ఎ.చిష్టీ, ఆది నికల్సన్, షేక్ ఖాసింవలి, టి.శ్రీనివాసరావు, ఎస్.కార్తీక్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : విజయవాడలో 15న నిర్వహించే ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు ప్రజల పెద్దఎత్తున తరలిరావాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని 4వ వార్డులో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు ఎం.బాలాజీ, ఆర్.వేణు, ఇ.సాంబయ్య, కె.కాటయ్య, ఎం.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తెనాలి : స్థానిక చెంచుపేటలోని బేవరేజెస్ డిపో కార్మికులతో సమావేశం నిర్వహించగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ఈనెల 9న తెనాలి అన్నాబత్తుని పుర వేదికకు చేరుకుంటుందని, బస్సు యాత్రకు ఘన స్వాగతం పలుకుదామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని ముఠా కార్మికుల సమావేశంలో సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్‌వలి మాట్లాడారు. కార్మికులు సంఘటితంగా ఉండి హక్కులను కాపాడుకోవాలని అన్నారు. విజయవాడలో నిర్వహించే ప్రజా రక్షణ భేరికి కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు.