రాష్ట్రంలో వ్యవసాయం చుక్కాని లేని నావలా దారి తెన్నూ కనబడక కునారిల్లుతున్నది. సాగు చేసే రైతు బతుకు నానాటికి ఛిద్రవుతున్నది. పాలకుల విధానాల మూలంగా కాలక్రమేణ సంభవిస్తున్న పెను మార్పులకు రైతన్న తాళలేకున్నాడు. సంక్షోభ పర్యవసాన ముప్పేట దాడులు అన్నదాతను వ్యవసాయం నుండి బయటకు గెంటేసేంతగా తీవ్రమవుతున్నాయి. సంక్షోభానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ పంట ఈ పంట ఈ రైతు ఆ రైతు భేదం లేదు. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో గోగు (మెస్తా) గణనీయంగా పండేది. ఇప్పుడు అంతర్ధానమైంది. చెరకు ఆ కోవలోకొచ్చేసింది. చెరకు ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. మన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లోకి ఇతర ప్రాంతాల బెల్లం చొచ్చుకొచ్చి ఆ పరిశ్రమను ముంచుతోంది. తరచూ విపత్తుల దాడికి వరి గురవుతోంది. కాలం కలిసొచ్చి కాసిన్ని వడ్లు పండితే వాటిని మద్దతు ధరకు అమ్ముకోలేని దైన్యం ధాన్యం రైతుది. నదులు, చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నా వరి సాగుకు నీరివ్వని దుస్థితి. అనంతపురం వంటి అనావృష్టి ప్రాంతాల్లో సైతం భూగర్భజలాలు పైకి ఉబికొస్తుండగా బోర్ల కింద వరి సేద్యంపై నిషేధం మానవ ప్రేరేపిత వైపరీత్యం కాక మరేంటి? పొగాకు, మిర్చి, పత్తి, వేరుశనగ సాగు జూదాన్ని తలదన్నుతోంది. ఉద్యానవన పంటలు అటు ప్రకృతి విపత్తులకు ఇటు గిట్టుబాటు ధర సమస్యకు మధ్య నలిగిపోతున్నాయి. ఆక్వా, సెరీకల్చర్లు అంతర్జాతీయ విపణి ప్రభా వానికి మగ్గిపోతున్నాయి. రైతుకు ఏ పంటా భరోసా ఇవ్వట్లేదు.
నానాటికీ రైతు సత్తువ కుంగుతుండగా వ్యవసాయాన్ని పండగ చేశాం, తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా భుజకీర్తులు తగిలించుకోవడం మసిపూయడమే. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నిరుడు దేశంలోనే రైతు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల్లో మనకు మూడవ స్థానాన్ని కట్టబెట్టింది. నేషనల్ శాంపిల్ సర్వే రైతు రుణగ్రస్తులున్న మొదటి రాష్ట్రమని 'కితాబు' ఇచ్చింది. అయినా సాగు బాగుందనడం ఆత్మవంచనే. ఏదో ఒక పేరుతో రైతుల చేతిలో ఎంతో కొంత పెడితే వాటితోనే రైతులకు పండగ అయిపోతుందా? నగదు బదిలీ రైతులందరికీ కావట్లేదు. అవసరమైన వారికి అవసరమైనంత ఇవ్వట్లేదు. వాటితోనే వ్యవసాయం బాగుపడిపోతుందంటే ఎలా? గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలే అన్నీ చూసుకుంటాయనడం సర్వ రోగాలకూ ఒకే మందు అన్న చందం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని హూంకరించారు. ఈ ఖరీఫ్ లోనే పెద్ద ఎత్తున పలు జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి, వేరుశనగ నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాలతో రైతులు భారీగా నష్టపోయారు. విత్తనాలమ్మిన కంపెనీల నుండి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తీరిగ్గా ఇప్పుడు సీడ్ యాక్టులో సవరణలు చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ఈ చిన్న విషయాన్ని గుర్తించడానికి లక్షలు పోసి నియమించుకున్న వ్యవసాయ సలహాదారులకు, వ్యవసాయ మిషన్లకు, వ్యవసాయ సలహా బోర్డులకు, నిష్టాగరిష్టులైన అత్యున్నతాధికారులకు ఇన్నేళ్లు పట్టిందంటే రైతు రక్షణపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధేమిటో తెలియడంలేదా? ఆర్‌బికె లలో ఎరువుల విక్రయాలనగా అదనుకు రైతుకు కావాల్సిన ఎరువులు దొరకని దుర్గతి పట్టింది. ఇ-క్రాప్ కష్టాలు, కౌలుదార్లకు కొత్త చట్టం ఇబ్బందులు ఉండనే ఉన్నాయి.
ఆర్‌బికె లలో ధాన్యం కొనుగోళ్లనగా రైతులకు నిరుడు రబీలో రూ.వేల కోట్ల బకాయిలు నెలల పర్యంతం పేరబడ్డాయి. ఈ ఖరీఫ్‌లో ఇప్పటికి చేపట్టిన కొనుగోళ్లు నామమాత్రం. ధాన్యం కొనుగోళ్లు చేయలేకనే రబీలో వరి వద్దంటోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని వెనుక కేంద్రం డైరెక్షన్ ఉంది. కేంద్రం అడ్డు అదుపు లేకుండా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రైతులపై మొయలేని భారాలు మోపుతున్నాయి. రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయాన్ని గాడిలో పెట్టాలంటే భరోసా వంటి కాయకల్ప చర్యలు ఎంత మాత్రం చాలవు. ఇప్పటికీ మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అవసరం. ఆ దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కదలాలి. లేకపోతే ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయి.










