జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాశక్తి -పాడేరు :జగనన్న భూరక్ష భూహక్కులు పథకం అమలులో భాగంగా చేపట్టిన భూముల రీ సర్వేతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాహశీల్దారులు, మండల సర్వేయర్లు, గ్రామ సచివాలయం సర్వేయర్లతో భూ రీసర్వేపై సమావేశం నిర్వహించారు. సమగ్రమైన రీ సర్వేపై స్పష్టమైన ఆదేశాలను అధికారులకు జారీ చేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భూములు సర్వే చేయవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందన్నారు. సమగ్ర సర్వేలో చేపట్టాల్సిన కీలక వివరాలను వివరించారు. అందరూ సమస్వయంతో పనిచేసి వివాదాలకు తావులేకుండా పగడ్బందీగా రీసర్వే చేయాలన్నారు. రీసర్వే పూర్తి చేసిన అనంతరం జగనన్న భూరక్ష భూ హక్కుల పథకం కింద శాశ్వత పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.భూముల విస్తీర్ణంలో తేడాలు లేకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే చేసి గ్రామ హద్దులను, రైతుల భూములకు హద్దులు నిర్ణయించాలని సూచించారు. త్వరితగతిన రీసర్వే పూర్తి చేయడానికి సమగ్రమైన కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే బృందాలు, రెవెన్యూ అధికారులు ముందుగా గ్రామ సభలు నిర్వహించి, .గ్రామస్తులు, రైతులు సహకారంతో రీ సర్వే పూర్తి చేయాలని సూచించారు. శతశాతం రీసర్వే పూర్తి చేయాలని, దీనిలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. సివిల్ వివాదాలు ఉంటే భూముల మ్యుటేషన్ చేయవద్దని సూచించారు. జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు మాట్లాడుతూ 2969 గ్రామాల్లో సర్వే జరగనున్న నేపథ్యంలో సర్వే బృందాలు సమయపాలన పాటించాలని, ముందుగా రైతులకు, గ్రామాలకు సమాచారమివ్వాలని సూచించారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా రీ సర్వే జరగాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, డిఆర్‌ఒ బలివాడ దయానిధి, డిఎఫ్‌ఒ వినోద్ కుమార్, సర్వే ఎడి వై. మోహనరావు పాల్గొన్నారు.










