Nov 05,2023 23:01

మాట్లాడుతున్న కాంతారావు

* క్రమబద్ధీకరణ చేయకుంటే వచ్చే నెలలో సమ్మె
* జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేయడం లేదని, నెలల తరబడి వేతనాలు విడుదల చేయడం లేదన్నారు. నగరంలోని ఎన్‌జిఒ హోంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, మినిమం టైం స్కేల్‌ ఉద్యోగుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిమం ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌పై జిఒలు ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగుల మధ్య విభజన పేరుతో విభేదాలు సృష్టిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సంప్రదాయాన్ని ప్రభుత్వ పెద్దలు గాలికొదిలేశారన్నారు. ప్రాజెక్టులో ఒకే కేడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తూ, కొత్త విధానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. పాత వారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితులైన వారికి అదనపు జీతాలు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దీనివల్ల సుదీర్ఘ కాలం పాటు సేవలందించే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్ట్‌ టైం పేరుతో తక్కువ జీతాలు అమలు చేయడం సరికాదన్నారు. గత ఎన్నికలకు ముందు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికి ఆ హామీని గాలికొదిలేశారని విమర్శించారు. దీనికితోడు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, సమగ్ర శిక్ష ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్‌ చేయడం లేదని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, పార్ట్‌ టైమ్‌ విధానాల్లోనే మగ్గుతున్నారని తెలిపారు. బస్సు యాత్ర చేసినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదని, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తే కుటుంబాలకు భరోసా ఉంటుందన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే త్వరలో జిల్లా, రాష్ట్ర కమిటీలు, అన్ని సంఘాలు, ఉద్యోగులతో కలిసి సమ్మె నోటీసు ఇచ్చి, డిసెంబరులో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఎం.ఆదినారాయణ మూర్తి, లోకేష్‌, పైడి మురళీకృష్ణ, టి.జయభారతి, కె.శారద, బి.శ్రావణి తదితరులు పాల్గొన్నారు.