ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర కార్యదర్శి వి.కాంతారావు మాట్లాడుతూ సమగ్ర శిక్షా, కెజిబివి లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సొర్సింగ్ , పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని శాఖల్లో ఉద్యోగులను రెగ్యులర్ చేసి, మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచిందన్నారు. కానీ ఆరేళ్లగా సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచలేదన్నారు. కనీస వేతనాల కోసం ఇచ్చిన జిఒ లు అమలు చేయలేదన్నారు. ఈ నేపధ్యంలో గత నెల రోజుల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శృంగవరపుకోట : సమగ్ర శిక్ష, కెజిబివిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఆర్‌టిసి కాంప్లెక్సు ఆవరణలో గాంధీ విగ్రహానికి వినతి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని శాఖలో ఉద్యోగులను రెగ్యులర్ చేసిందని, మినిమ్‌ం టైంస్కేల్ అమలు చేసి వేతనాలు పెంచారని తెలిపారు. ఆరేళ్ల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచలేదని, నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉన్నాయని వాపోయారు. ఎంటిఎస్ కోసం ఇచ్చిన జిఒలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రవాణాఛార్జీలు, పని భారంతో ఉద్యోగులు అల్లాడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గత నెల రోజుల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదని వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో జీవనం దుర్భరంగా మారిందన్నారు. గాంధీ ద్వారా ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు.










