
ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : విద్యాశాఖ పరిధిలో గల సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జెఎసి నాయకులు బివి రమణ, బి.ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జెఎసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెఎసి నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అందరికీ మినిమం టైమ్ స్కేల్, హెచ్‌ఆర్‌ఎ, డిఎ అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న పార్ట్‌టైమ్ విధానం రద్దు చేసి ఫుల్ టైం కాంటాక్ట్ విధానం అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుటీ రూ.10 లక్షలు చెల్లించాలని, సామాజిక భద్రత పథకాలు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు చెల్లించాలని, మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు జాబ్‌చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతం చెల్లించాలని కోరారు. ఈ సమస్యలపై ఇప్పటికే అనేక దఫాలుగా ప్రభుత్వానికి వినతులు అందించామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో రాష్ట్రవ్యాప్తంగా జెఎసి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు డి.గురువులు, వై.గౌరమ్మ, కె.నరసింహాచారి, డి.ఉమామహేశ్వరరావు, క్రాంతి, బి.నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.