Aug 25,2023 23:06

ఓటర్‌ జాబితాపై ఓటర్లను స్వయంగా అడుగుతున్న కమిషనర్‌


ప్రజాశక్తి - విజయవాడ : పారదర్శక ఓటర్‌ జాబితా సమగ్రతను నిర్ధారించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలనా కార్యక్రమం జరుగుతుందని సెంట్రల్‌ నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఒ), నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు.సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 32 వడివిజన్‌ లోటస్‌ దగ్గర రామలింగేశ్వర పేట, 57 వ డివిజన్‌ న్యూ రాజరాజేశ్వరీ పేట లోని పోలింగ్‌ స్టేషన్‌ 1,2,4,5,6,7, 8 బిఎల్వో యాప్‌ ద్వారా నిర్వహించిన ఓటర్ల జాబితా పరిశీలనా కార్యక్రమాన్ని కమిషనర్‌ శుక్రవారం పరిశీలించి, జరుగుతున్న తీరును స్వయంగా ఓటర్ల నుంచే సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఓటర్‌ లిస్ట్‌ రీ వెరిఫికేషన్‌ ప్రక్రియలో తొలగింపులు, స్థాపిత నిబంధనలకు అనుగుణంగా ,తగిన డాక్యుమెంటేషన్తో జరుగుతున్నాయో లేదా అని సంబంధిత సిబ్బంది నుంచి కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలకు కట్టుబడి ఉండేలా మరణం , తరలింపు వంటి కారణాలతో అనివార్యమైన ఈ తొలగింపులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సిబ్బందిని ఆదేశించారు. బిఎల్‌ఒలు ప్రతి ఇంటికి వెళ్లి క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితముగా పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదులు, మార్పులు, చేర్పులు , చనిపోయిన ఓటర్ల తొలగింపు వంటి వాటికి ఫారం-6, 6ఎ, 7, 8 ఫారములను అందించి దరఖాస్తులను స్వీకరించి మొబైల్‌ యాప్‌ అప్‌ లోడ్‌ చేశారా లేదా అని స్వయంగా కమిషనర్‌ ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, సూపర్వైజర్‌ అధికారులు, బిఎల్‌ఓలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.