* కలెక్టరేట్ వద్ద హమాలీ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, హమాలీ కార్మికుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిన్నారావు, కె.సూరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై హమాలీ కార్మికుల ఫెడరేషన్ ఆధ్వర్యాన హమాలీ కార్మికులు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ, జట్టు, ముఠా, కళాసీ కార్మికులకు పని భద్రత కల్పించాలన్నారు. కార్మికులందరికీ పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర చట్టం అమలు కోసం వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో మార్కెట్ యార్డులు, బజారు కొట్లు, పళ్లు, కూరగాయల మార్కెట్లు, ఆర్‌టిసి, ప్రభుత్వ, ప్రైవేటు గొడౌన్లు, ఎఫ్‌సిఐ, వేర్‌హౌస్, సివిల్ సప్లయిస్, రైస్‌మిల్స్ తదితర చోట్ల సుమారు ఆరు లక్షల మంది ముఠా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. పనిభద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పనిచేస్తున్న చోట ప్రమాదం సంభవించి అంగవైకల్యం పొందినా, ప్రాణాలు కోల్పోయినా పట్టించుకునే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. 50 కేజీలకు మించిన బరువులను మోయించరాదని అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానించినా, అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ముఠా కార్మికుల సమస్యలపై పల్లెత్తు మాట మాట్లాడడం లేదన్నారు. హమాలీ, ముఠా, కళాసీ కార్మికులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం డిఆర్‌ఒ పి.మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు టి.తిరుపతిరావు, కె.లక్ష్మీనారాయణ, పి.అప్పలరాజు, డి.మహాలక్ష్మి, బి.రామారావు, టి.సూర్యనారాయణ, ఎన్.దుర్గారావు, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










