ప్రజాశక్తి - పరవాడ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు)పై ప్రజలకు తెలియజేయడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా గ్రామసభలు నిర్వహించి, రీ సర్వే ఏ రోజు చేసేది, దానికి రైతులు ఏమి చేయాలో తెలియజేయాల్సి ఉండగా, గ్రామసభలు నిర్వహించకుండానే పరవాడ మండలంలో రీ సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో స్థానిక రైతుల్లో గందరగోళం నెలకొనగా, బయట ప్రాంతాల్లో ఉన్న రైతులకు అసలు సమాచారమే తెలియని పరిస్థితి ఉంది.
వందేళ్ల తర్వాత రాష్ట్రంలో చేపడుతున్న ఈ భూ రీ సర్వే ద్వారా భూ వివాదాలు పరిష్కరించబడతాయని వైసిపి ప్రభుత్వం చెబుతున్న మాట. పరవాడ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇప్పటికే డ్రోన్‌ల సహాయంతో సరిహద్దులు నిర్ణయించారు. డ్రోన్ చిత్రాలు రావాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో ఇ.మర్రిపాలెం గ్రామంలో రీ సర్వే నిర్వహించారు. అయితే ఆ గ్రామంలో రైతుల సమస్యలు తీర్చకుండానే సర్వే ముగించేశారు. ఇప్పుడు రెండో ఫేజ్‌లో సోమవారం నుంచి తానాం, భర్నికం, పిఎస్.భోనంగి, పిఆర్.భోనంగి. పి.భోనంగి, కలపాక, పెదముషిడివాడ, కన్నూరు, పరవాడ తదితర 9 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే చేపట్టనున్నారు.
రీ సర్వేకు ముందు ఆయా రెవెన్యూ గ్రామాల్లో వారం రోజులు పాటు రైతులకు అవగాహన కలిగించే విధంగా ప్రచారం చేయాలి. వాల్ పోస్టర్లు, ఎలక్ట్రానిక్, ఇతర ప్రసార సాధానాల ద్వారా రైతులకు రీ-సర్వే వివరాలు పూర్తిగా వారికి తెలిసే విధంగా ప్రచారం చేపట్టాలి. గ్రామసభ నిర్వహించి భూ రీ సర్వే ప్రాధాన్యత తెలియజేయడంతో పాటు ఏ తేదీన సర్వే చేస్తుందీ చెప్పి రైతులను సంసిద్ధులను చేయాల్సి ఉంది. కాని పరవాడ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించకుండానే రీ సర్వేకు పూనుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రారంభం కానున్న 9 రెవెన్యూ గ్రామాల్లో భర్నికం, పరవాడలో మాత్రమే గ్రామసభలు జరిగాయి. మిగిలిన గ్రామాల్లో గ్రామసభలు రికార్డులకే పరిమితం అయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న రైతుల నుండి వాలంటీర్ల ద్వారా పాస్ పుస్తకాలు, 1బి కాపీలు, ఆధార్ కార్డులు సేకరించారు. కానీ రీ-సర్వే గురించి గ్రామ సభలు నిర్వహించ లేదు. దీనికి తోడు ఎటువంటి ప్రచారం చేపట్టలేదు. దీంతో సర్వే చేయబోతున్న గ్రామాల్లోని రైతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బయట గ్రామాల్లో ఉన్న రైతులు తమకు సమాచారం తెలియదని అంటున్నారు.
రీ-సర్వే పేరుతో రెవెన్యూ యంత్రాంగం హడావుడిగా గందరగోళంగా సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నట్లు కనిపిస్తుందని, ఇలా అయితే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గామాల్లో ప్రచారం చేసి, గ్రామ సభలు నిర్వహించి రీ-సర్వేలో వివాదాలు రాకుండా రైతులకు ముందుగా అవగహన కల్పించిన తర్వాతనే సమగ్ర భూ సర్వే చేయాలని రైతులు కోరుతున్నారు.










