ప్రజాశక్తి - పరవాడ
పరవాడ ఫార్మాసిటీలోని స్మైలెక్స్ లేబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-4లో ఐరన్ ఫోల్‌పై నుండి పడి కార్మికుడు మేడిశెట్టి పైడిరాజు (38) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ఓనుం అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. జివిఎంసి 77వ వార్డు అప్పికొండ శివారు మురుబాయి గ్రామానికి చెందిన మేడిశెట్టి పైడిరాజు, ఓనుం అప్పారావు రెండు నెలల నుండి స్మైలెక్స్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీలో పెయింటింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం కూడా కంపెనీలోని 25 అడుగుల ఐరన్ పైపుకు పెయింటింగ్ పనులు చేస్తూ ఉండగా సేఫ్టీ బెల్ట్‌కు కట్టిన తాడు తెగిపోవడంతో 25 అడుగుల పైనుండి కిందపడి పోవడంతో పైడిరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ ఉన్న మరో కార్మికుడు అప్పారావు కూడా కింద పడిపోవడంతో తీవ్ర గాయా లయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యం నిమిత్తం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పైడిరాజు మృతదేహాన్ని విశాఖ కేజీ హేచ్ కు తరలించారు. దీనిపై పరవాడ సిఐ పి.ఈశ్వరరావును వివరణ కోరగా తమకు ఎవరు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని, దీంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు.
కంపెనీ గేట్ ముందు ఆందోళన
ప్రమాదం విషయం తెలిసిన గ్రామస్తులు కుటుంబీకులతో కంపెనీ గేటు వద్దకొచ్చి ఆందోళన చేశారు. ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ వారికి సంఘీభావం తెలిపారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని, క్షతగాత్రునికి మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని కోరారు.










