ప్రజాశక్తి- కలెక్టరేట్ : కార్మిక, ప్రజా సంఘాల ఐక్యతతో, రాజకీయ పార్టీల అండతో సమైక్యంగా పోరాడి స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకుంటామని వైఎస్‌ఆర్‌టియుసి నాయకుడు వై.మస్తానప్ప, సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి ఒ.అప్పారావు, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 527వ రోజుకు చేరాయి. దీక్షల్లో వైఎస్‌ఆర్‌టియుసి, సిఐటియు, ఎంఆర్‌పిఎస్ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడానికి నిర్ణయించడం దుర్మార్గమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు మూల స్తంభాలన్నారు. అటువంటి వాటిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తే దేశానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో నడుస్తుందని, అటువంటి దానిని ప్రయివేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షల్లో సిఐటియు కంచరపాలెం జోన్ నాయకులు బి.సింహాచలం, శరత్, శ్రవణ్, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు ఎన్నేటి రమణ, గొందేసి అప్పలరెడ్డి, పెద్దాడ అప్పలరాజు, గాలి నూకరాజు, బర్సింగి రామకృష్ణ, గంట్యాడ సత్యారావు, ఎస్.భీమరాజు, ఎంఆర్‌పిఎస్ నాయకులు తొత్తరమూడి శ్రీనివాస్, చింతాడ రాజశేఖర్, హనుమంతరావు పాల్గొన్నారు.










