విశాఖ ఉక్కు విదేశీ, స్వదేశీ కార్పొరేట్ రాబందుల పాలు గాకుండా రక్షించుకునేందుకు కార్మిక సంఘాలన్నీ ఏకమై ఒక పోరాట కమిటీని ఏర్పాటు చేయడం శుభపరిణామం. గతంలో 1998-2000 మధ్యకాలంలో విశాఖ ఉక్కును కబళించడానికి జరిగిన కుట్రను సైతం ఇటువంటి కార్మిక ఐక్యవేదిక ఆధ్వర్యంలోనే జయప్రదంగా తిప్పికొట్టిన సంగతి మనం గుర్తు చేసుకుంటే ఈసారి కూడా ఐక్య కార్మిక పోరాటం విజయం సాధించడం తధ్యం అన్న విశ్వాసం కలుగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రజానీకం విశాఖ ఉక్కును అమ్మివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్న కార్మికులకు తెలుగు ప్రజానీకం అండదండలున్నాయి.
విశాఖలో ఉక్కు కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించగానే, దానికి ప్రజల నుండి వచ్చిన అపూర్వ సానుకూల స్పందన చూసి రాజకీయ పార్టీలన్నీ ఒక్కొక్కటిగా కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రకటనలు చేశాయి. వామపక్షాలు ఉక్కు పరిరక్షణ విషయంలో ఆదినుండీ ఒకే విధమైన నిబద్ధతతో వ్యవహరిస్తున్నాయి కనుక కార్మిక ఉద్యమానికి తమ మద్దతును తెలియజేయడంలో కూడా ముందే ఉన్నాయి. ఇక తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజల మనోభావాలను గమనించి ఉక్కు ప్రైవేటీకరణను తామూ వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి. ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు.
కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపి కి చెందిన రాష్ట్ర నేతలు సైతం ఉక్కు అమ్మకం కూడదని ప్రకటించడం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణికి, నయవంచనకు మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఇదేదో యథాలాపంగా తీసుకున్న నిర్ణయం అయినట్టు, తాము కేంద్రం దృష్టికి తీసుకుపోతే ఆ నిర్ణయాన్ని మోడీ సర్కారు మార్చుకుంటుందన్నట్టు రాష్ట్ర బిజెపి నేతలు మాట్లాడడం పచ్చి మోసం. జనసేనాని పవన్ కల్యాణ్ 'మేం చెప్పేది చెప్పేశాం, ఇక అంతా కేంద్ర బిజెపి దయ' అని చేతులెత్తేశారు. గాజువాకలో తమ హామీలను గాలికొదిలేశారు.
విశాఖ ఉక్కును ఎలాగైనా కబళించాలని అంతర్జాతీయ ఉక్కు అనకొండ 'పోస్కో' కొన్నేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాల వైనం కేంద్ర మంత్రి పార్లమెంటులో ఈ నెల పదవ తేదీన ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతో వెల్లడైంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడే దీనిపై కదలిక మొదలైంది. 2019, 2020 సంవత్సరాలలో వేగం పుంజుకుంది. ఎంవోయూ కూడా కుదిరింది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని పోస్కో ప్రతినిధులు నాలుగుసార్లు కలిసి సంప్రదింపులు జరిపారు. అంటే విశాఖ ఉక్కుపై సాగుతున్న కుట్ర గురించిన సమాచారం వైసిపి, టిడిపి నేతలకు తెలుసు. మరి ఈ విషయంలో ఆ పార్టీలు ఎటువంటి వైఖరి తీసుకున్నాయన్న విషయాన్ని ఆ పార్టీల నేతలు ఇప్పటికైనా బహిర్గతం చేయాలి. అదేవిధంగా విశాఖ ఉక్కుకు స్వంత గనులను కేటాయించే విషయంలో డిమాండు ఎప్పటి నుంచో ఉన్నా, ఆ గనుల సాధనకు కృషి చేస్తామని వివిధ ఎన్నికల సందర్భంలో అటు టిడిపి, ఇటు వైసిపి హామీలు ఇచ్చినా, ఆ విషయమై తాము చేసిన కృషి ఏమిటో ఇప్పుడైనా కార్మికులకు, ప్రజానీకానికి తెలియజేయాలి. తాము ఉక్కు పరిరక్షణకు నిజాయితీగా, నిబద్ధతతో నిలబడుతున్నామని అప్పుడే ఆ పార్టీలు చెప్పుకోగలుగుతాయి.
ఇదేదో కార్మికుల సమస్య అని భావించి ఇతర తరగతుల ప్రజానీకం కేవలం మద్దతు తెలపడానికే పరిమితం అయిపోతే చాలదు. ప్రజలు పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మాత్రమే గాక వివిధ రూపాలలో ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతోంది. రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఉంది. వందలాది అనుబంధ పరిశ్రమలు దీనిపై ఆధారపడి వున్నాయి. వ్యాపారాలు, విద్యా, వైద్య రంగాలు, రియల్ ఎస్టేట్, సేవారంగం విశాఖ ఉక్కు కారణంగా చాలా అభివృద్ధి చెందాయి. సామాజిక న్యాయానికి ప్రభుత్వ రంగ విశాఖ ఉక్కు ఒక ఆధారంగా ఉంది. ఇటువంటి మరొక పరిశ్రమ తమ ప్రాంతానికీ రావాలని రాయలసీమ ప్రజానీకం బలంగా కోరుకోవడం వెనుక కారణం ఇదే. అదనంగా పరిశ్రమ అడిగితే, ఉన్నదానినే ఊడగొడుతున్న బిజెపి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాన్ని తిప్పికొట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజానీకమూ పోరాటాన్ని నడిపిస్తున్న ఐక్య కార్మిక వేదికకు అండగా నిలవాలి. అప్పుడే మన రాష్ట్ర అభివృద్ధీ, మన ఆత్మగౌరవం, తెలుగుజాతిగా మన అస్థిత్వం మనగలుగుతాయి.










