
ప్రజాశక్తి-తాడేపల్లి : ప్రజా సమస్యలపై మంగళగిరి నియోజకవర్గంలో 3వ తేదీ నుంచి సిపిఎం ప్రజా చైతన్యయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ప్రారంభ సందర్భంగా 3వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభ సభ ఉంటుందన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. ఉండవల్లి సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమై పది రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటిస్తూ మంగళగిరి మండలం నిడమర్రులో ముగుస్తుందని, 16వ తేదీన మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ ప్రాంతంలో పేదల కోసం ఉద్యమాలు నడిపి పోరాటాలు చేసి సుమారు ఆరు వేల మందికి ఇళ్లు వేయించిన చరిత్ర సిపిఎంకు ఉందన్నారు. నియోజకవర్గంలో సింహాద్రి శివారెడ్డి, భీమిరెడ్డి సాంబిరెడ్డి, మేకా అమరారెడ్డి, బండారు ముత్యాలు, మాలకొండారెడ్డి 20 వేల మందికి ఇళ్లపట్టాల కోసం కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన పేదలందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. సిఎం నివాసం ఉంటున్న తాడేపల్లి పట్టణాన్ని రాబోయే రోజుల్లో డ్రెయినేజీ ముంచెత్తనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానది పక్కనే ఉన్నా తాగునీటి సమస్య కొన్ని ప్రాంతాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పట్టణ జనాభాకు అనుగుణంగా రెండు పూటలా తాగునీరు సరఫరా చేయాలని కోరారు. తాడేపల్లిలో కొండ చుట్టూ ఇళ్లు వేసుకుని ఉంటున్న పేదలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న లంక భూములకు ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా పట్టాలు ఇవ్వాలన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌తో పాటు రాజధాని అమరావతిలో పారిశుధ్య కార్మికులకు పని భారం పెరిగిందని, పనికి తగ్గట్లు పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. నెలనెలా పారిశుధ్య కార్మికులు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీనియర్ నాయకులు పి.బాలకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, ఎం.రవి, ఎస్‌ఎస్ చెంగయ్య, తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, ఎస్.ముత్యాలరావు, వై.బర్నబస్, పి.కృష్ణ పాల్గొన్నారు.