ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలు తూతూమంత్రంగా జరిగాయి. ప్రతిపాదిత పనులు, జెడ్పీ భూముల లీజులు తప్ప ఇతర శాఖల వారీగా అజెండా అంశాలు లేకుండానే సమావేశాలు జరిపారు. ఇరిగేషన్, విద్య, వైద్య ఆరోగ్యశాఖపై నామమాత్రంగా చర్చించారు. కీలకమైన వ్యవసాయ రంగం అజెండానే లేదు. నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే కిలారు రోశయ్య మినహా ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరూ హాజరు కాలేదు.
జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన శుక్రవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత గత సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై చర్చించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, గుంటూరు, పల్నాడు జిల్లాల సంయుక్త కలెక్టర్లు జి.రాజకుమారి, శ్యాంప్రసాద్ హాజరయ్యారు. అమరావతి ఎంపిపి మేకల హనుమంతరావు మాట్లాడుతూ నల్లపాడులోని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న గొర్రెల మండీ అధికారికమా? అనధికారికమా? తేల్చాలన్నారు. ప్రతి జీవానికి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.100 వసూలు చేస్తున్నారని, అదనంగా వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టిలో ఉన్నా చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చామని మార్కెటింగ్ ఏడీ రాజబాబు తెలపగా కొన్నేళ్లుగా ఇలా జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి రాంబాబు ప్రశ్నించారు. చూసి చూడనట్లు ఉంటున్నారని, నోటీసులతో సరిపెడ తారా? అని అన్నారు. అధికారికమైతే మండీలో కార్యకలాపాలను సంబంధిత అధికారులు నియంత్రించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కాకుమాను గురుకుల పాఠశాలలో నీటి సమస్య తీర్చటానికి రూ.9 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభించటంలో తీవ్ర జాప్యం నెలకొందన్నారు. పల్నాడు జిల్లాలో ఉపాధ్యాయులను గుంటూరు పరిసర ప్రాంతా లకు డెప్యుటేషన్ చేయటం వల్ల పల్నాడు ప్రాంతంలో టీచర్ల కొరత ఏర్పడుతోందని, డిప్యుటేషన్లు వేయొద్దని కోరారు.
వరికి నీరు ఇవ్వలేము...
ఇరిగేషన్‌పై జరిగిన చర్చలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాది వరికి నీరు ఇవ్వలేమని తెలిపారు. సాగర్, శ్రీశైలంలో తగిన నీటి నిల్వలు లేవన్నారు. గత వందేళ్ల కంటే తక్కువ వర్షపాతం గత నెల ఆగస్టులో నమోదైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలకే నీరిస్తామని, వారాబందీ విధానంలో విడుదల చేస్తామని అన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించి, త్వరలోనే ఎప్పటి నీరు ఇస్తాం, ఏయే పంటలు వేసుకోవాలో ప్రకటిస్తామని చెప్పారు. కాగా కృష్ణా పశ్చిమ డెల్డాలో కొంత మెరుగ్గా ఉందన్నారు. కెడబ్ల్యూడి పరిధిలో ఖరీఫ్‌కు నీరు ఇస్తామని, ఈ విషయాన్ని రైతులకు ప్రజాప్రతినిధులు వివరించాలని కోరారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ విస్తరణకు, వరికెపూడిశెలకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్టులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజల చిరకాల కోరికని చెప్పారు. గుంటూరు ఛానల్ విస్తరణకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా విడుదలైనా నిధులు లేక ఆగిందన్నారు. వరికెపూడిశెలకు కేంద్రం అటవీ శాఖ నుండి అనుమతి వచ్చినందుకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలన్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తానన్నారు.
కల్తీ విత్తనాలకు కేంద్రంగా గుంటూరు
గుంటూరు జిల్లా కల్తీ విత్తనాలకు కేంద్రంగా మారిందని, ఆయా విత్తనాలు తయారు చేసే వారు, డీలర్లపై సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నదని సభ్యులు అన్నారు. క్రోసూరు, అచ్చంపేటలో కల్తీ విత్తనాల అంశాన్ని గత సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రస్తావించిగా, దానికి వ్యవసాయ శాఖ తీసుకున్న చర్యలపై చర్చించారు. శాస్త్రవేత్తలను పంపించి పంట పరిశీలన చేయించారని, కల్తీ ఉన్నట్లు తేలిందని, పరిహారం ఇవ్వాలని కంపెనీకి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై లక్ష్మణరావు స్పందిస్తూ పరిహారం సంగతి అటుంచితే కంపెనీపై చర్యలు ఏమి తీసుకున్నారని ప్రశ్నింగా అధికారుల నుండి సమాధానం లేదు. చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూసినప్పుడుల్లా కొంత పరిహారం చెల్లించి తప్పించుకుంటున్నారన్నారు. కల్తీ ఇండిస్టీకి గుంటూరు కేంద్రంగా మారిందన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరిహారం చెల్లించి, కంపెనీలు అంతకు మూడు రెట్లు రైతుల నుండి సంపాదించుకుంటున్నాయన్నారు. కంపెనీలు కల్తీ చేయటంలో డ్రైన్డ్ అని అన్నారు. అచ్చంపేట జెడ్పీటిసి మాట్లాడుతూ జెనెటిక్ పరీక్షలో దిగుబడి చూపిందచదని, కావున ఆ పరీక్షను ప్రామాణికంగా తీసుకోకూడదన్నారు. జెనెటిక్ పరీక్షలో లోపాలను అడ్డం పెట్టుకొని కంపెనీలు తప్పికుంటున్నాయని చెప్పారు.
జెడ్పీ భూములపై హైడ్రామా..
ఆక్రమిత జెడ్పీ భూములపై హక్కులు కల్పించటంపై సమావేశంలో హైడ్రామా నడిచింది. పలువురు సభ్యులు దీనిపై తొలుత జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో, సర్వసభ్య సమావేశంలోనూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పొన్నూరులో సర్వే నంబర్ 388/3లో గల 0.71 సెంట్ల జెడ్పీ భూమిలో 287 చదరపు మీటర్ల భూమిని పరస్పర మార్పిడి ప్రాతిపదికన నలుగురు రైతులు వారి భూముల్లోకి వెళ్లటానికి దారి ఇవ్వాలని ప్రతిపాదించారు. జెడ్పీ భూమికి ప్రత్యామ్నాయంగా రైతుల భూమిని ఇస్తున్నట్లున్నట్లు చెప్పారు. అయితే దీనిపై పొన్నూరు జెడ్పీటిసి అభ్యంతరం వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే దీనిలో అభ్యంతరం లేదన్నారు. రైతులు ఆయా భూముల్లో పంటలు వేయట్లేదని, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారామోనని జెడ్పీటిసి అన్నారు. దీనిపై మంత్రి కలుగచేసుకొని జెడ్పి భూమికి ప్రత్యామ్నాంగా రైతుల భూమి ఇస్తున్నప్పుడు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో కూడా 40 ఏళ్ల క్రితం జెడ్పికి చెందిన 1.10 ఎకరాల్లో సుమారు 46 మంది నివాసం ఉంటున్నారని, వారికి హక్కులు కల్పించాలని కోరారు. అయితే మార్కెట్ వ్యాల్యూ, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ధరను వారు చెల్లించే పరిస్థితి లేదని, కావున ఏదో ఒక రేటు జెడ్పీ నిర్ణయించాలని కోరారు. ఈ రెండు ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. అనంతరం అజెండాలో అంశాలను అన్నీ ఆమోదించినట్లు సిఇఒ ప్రకటించినా, జెడ్పీ చైర్‌పర్సన్ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
భట్టిప్రోలు పిహెచ్‌సి వైద్యుడు సరెండర్..
వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన చర్చలో భట్టిప్రోలు జెడ్పీటిసి ఉదయ భాస్కరి భట్టిప్రోలు పిహెచ్‌సిలో ఒక వైద్యుడు ప్రతి రోజూ మద్యం సేవించి హాస్పిటల్‌కు వస్తున్నాడని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. దీనిపై సదరు డాక్టర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు బాపట్ల డిఎంఅండ్‌హెచ్‌ఒ తెలిపారు. కాగా బాపట్ల కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ఫైల్ పెట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కొత్త వైద్య శాలలు నిర్మించినా, వైద్యుల్ని ఏర్పాటు చేసినా వారు సమయానికి ఆసుపత్రిలో ఉండకపోతే ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నారు. పిహెచ్‌సిల్లో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.
రాజీనామా చేస్తా : తాడికొండ జెడ్పీటిసి
కాగా విద్యారంగంపై చర్చ ప్రారంభం కాగానే తాడికొండ జెడ్పీటిసి గుడిమెట్ల జ్యోతి ఒక్కసారిగా సభలో తన సీటులో నుంచి లేచి మండలంలో గడ గడపకూ మన ప్రభుత్వం ఇతర ఏ కార్యక్రమానికి తనను ఆహ్వానించట్లేదని వ్యక్తం చేశారు. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ వెంటనే రొంపిచర్ల ఓబులురెడ్డి మాట్లాడుతూ మా మండలంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. దీనిపై మంత్రి రాంబాబు స్పందిస్తూ సమస్యలు మాట్లాడదామని, రాజీనామా ఏమీ వద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాడికొండ జెడ్పీటిసి సభలో నుండి బయటకు వచ్చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక జెడ్పీటిసిగా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, కానీ ఎలాంటి గుర్తింపూ లేని కారణంగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జెడ్పిటిసిలకు ప్రోటోకాల్ పాటించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.