Oct 10,2023 20:36

ప్రజాశక్తి - ఆచంట : మండల సర్వసభ్య సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఎల్‌సి వంకా రవీంద్రనాథ్‌ అన్నారు. మంగళవారం ఆచంట మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎల్‌సి వంకా రవీంద్రనాథ్‌ హాజరై మాట్లాడారు. ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికలైన తర్వాత పార్టీలతో చూడకుండా అభివృద్ధి వైపు చూడాలని సూచించారు. ముఖ్యంగా వైద్యాధికారులు మండల సమావేశానికి ఎప్పుడూ రాకుండా కేవలం సూపర్‌వైజర్లను మాత్రమే సమావేశాలకు పంపడం సరికాదని హెచ్చరించారు. వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు. మండల సమావేశంలో రికార్డు తప్పనిసరిగా రాయాలన్నారు. సమావేశంలో వచ్చిన సమస్యలను ఎంతవరకూ పరిష్కరించామని, తదుపరి సమావేశానికి ఈ సమావేశంలో చర్చించుకున్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆయన సూచించారు. దాళ్వాలో రైతులు చాలా నష్టపోయారని ముఖ్యంగా గోనె సంచుల కొరత, తేమ శాతం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారని జెడ్‌పిటిసి సభ్యులు ఉప్పలపాటి సురేష్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్‌పిటిసికి మండల పరిషత్‌ కార్యాలయంలో కనీసం కూర్చోవడానికి ఛాంబర్‌ కూడా ఏర్పాటు చేయలేదని, టిడిపి జెడ్‌పిటిసి అయినందువల్ల తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు రాకుండా చేయడం, వచ్చినా వాటిని ఉపయోగించకుండా ఎంఎల్‌ఎ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 15వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎఇఒ నాగరాజు తెలిపారు. భీమలాపురం, వల్లూరు సర్పంచులు మాట్లాడుతూ సర్పంచులుగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు తమ చేతులతో లబ్ధిదారులకు ఒక్క పెన్షన్‌ కూడా ఇప్పించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. ఆచంట నుంచి సిద్ధాంతం రహదారి అధ్వానంగా ఉందని, ఆ రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని సభ్యులు ఆర్‌అండ్‌బి ఎఇని నిలదీశారు. ఎఇ ప్రసాద్‌ మాట్లాడుతూ రూ.16 లక్షల నిధులు మంజూరయ్యాయని వీటిలో ఏడు మీటర్లు దేవ వరకు రహదారి వెడల్పు చేశామని తెలిపారు. మరో 600 మీటర్ల సీసీ రోడ్డు పూర్తి చేశామని తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంట్‌ బిల్లు పెంచారని, తక్షణం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని జెడ్‌పిటిసి సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహప్రసాద్‌, డిప్యూటీ తహశీల్దార్‌ సుగుణ సంధ్య, మండల ఉపాధ్యక్షులు ఎర్రగుప్పుల నాగరాజు, తాళం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.