Oct 06,2023 22:29

సమావేశంలో పంచాయతీ భవనం గురించి ప్రశ్నిస్తున్న సర్పంచ్‌ సన్యాసినాయుడు

ప్రజాశక్తి-దత్తిరాజేరు :  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి పంచాయతీలను నిర్వీర్యం చేశారని, పంచాయతీ భవనం లేకపోవడంతో పాలకవర్గ సమావేశాలు నిర్వహించ లేకపోతున్నామని కన్నాం సర్పంచ్‌ చుక్క సన్యాసినాయుడు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంజూరైన నిధులు నిలిచిపోయాయని వాపోయారు. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి గేదెల సింహాద్రి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పరంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఎఒ అనురాధ ఇ-క్రాప్‌ నమోదు గత ఏడాది కంటే తక్కువగా నమోదైందని, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇ-క్రాప్‌ నమోదులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని , ఏయే గ్రామాలలో తక్కువగా ఉందో వెంటనే నాలుగు రోజుల్లో సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే.. ఎఒకు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్‌పిటిసి రౌతు రాజేశ్వరి, వైస్‌ ఎంపిపిలు బి.అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్‌, ఎంపిటిసి సభ్యులు మంత్రి అప్పలనాయుడు, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ సమల శ్రీనివాసరావు, ఎంపిడిఒ సుబ్రహ్మణ్యం, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ రమేష్‌ పాల్గొన్నారు.