ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక సంస్థలు, జెడ్పీ సమావేశాల పట్ల అధికారుల వైఖరి బాధాకరమని జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అన్నారు. శుక్రవారం జెడ్పీ స్థాయి సమావేశాలు జెడ్పీ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ స్థాయి సంఘ సమావేశంలో ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు అధికారులందరికీ ముందుగానే సమాచారం ఇస్తున్నామని, కానీ ప్రతిసారీ ఏదోఒక కారణం చెప్పి హాజరు కావట్లేదని అన్నారు. సమావేశంలో తొలుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చర్చను ప్రారంభిస్తూ విద్య, వైద్యంపై చర్చ జరగాల్సిన ఈ స్థాయి సంఘ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు హాజరు కాకపోవటం సరికాదన్నారు. జిల్లా అధికారులు హాజరు కాకపోతే సభ్యులు సమస్యలపై ఎవరితో చర్చించాలని ప్రశ్నించారు. అధికారుల వైఖరిపై తీవ్ర నిరసన తెలియజేస్తున్నానని అన్నారు. అధికారులకు స్థానిక సంస్థల పట్ల అధికారులకు గౌరవం లేదా అని ప్రశ్నించారు. కర్లపాలెం, బాపట్ల మండలాల్లో ఐదు ఎయిడెడ్ స్కూల్స్ మూతపడ్డాయని, వాటికి ప్రత్యామ్నాంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కెఎస్ లక్ష్మణరావు కోరారు. అనేక దశాబ్ధాలుగా జెడ్పీ హైస్కూల్స్ లేని మండల కేంద్రాలైన రెంటచింతల, భట్టిప్రోలు, ఫిరంగిపురం, అమరావతి తదితర మండల కేంద్రాల్లో జెడ్పీ హైస్కూల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది ప్రారంభించిన ప్లస్-2 స్కూల్స్‌లో వచ్చే విద్యా సంవత్సరానికైనా సరిపడా అధ్యాపకులు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. పొన్నూరు జెడ్‌పిటిసి మాట్లాడుతూ జెడ్పీ హైస్కూల్స్‌లో నైట్ వాచ్‌మెన్ల నియామకంలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. రేషన్ కార్డుల్లో పేర్లు మార్పులకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయని విషయాన్ని మాచవరం జెడ్‌పిటిసి, ఇతర సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు.
ఛైర్‌పర్సన్‌కు ఎమ్మెల్సీ కెఎస్ అభినందన
జెడ్పీ హైస్కూల్స్‌కు నైట్ వాచ్‌మెన్ల నియామక ఉత్తర్వులు రావటంలో ముఖ్యపాత్ర పోషించిన జెడ్పీ ఛైర్‌పర్సన్‌ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అభినందించారు. స్థాయి సంఘ సమావేశాల సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు క్రిస్టినాను శాలువా, పూలబొకేతో సన్మానించారు. అనేక సంవత్సరాలుగా పాఠశాలల్లో విలువైన వస్తువుల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నిరోధానికి నైట్ వాచ్‌మెన్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ సిఎం ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేయటం అభినందనీయమన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 5600 పాఠశాలల్లో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 350 హైస్కూల్స్‌లో వాచ్‌మెన్ల నియామకం జరుగుతుందన్నారు.










