Sep 15,2022 23:27

సమావేశంలో మాట్లాడుతున్న శ్రావణ్‌కుమార్‌

ప్రజాశక్తి -కంచరపాలెం : స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.కోట్లలో వసూలుచేసిన స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ ఇందుపూడి సుధాకర్‌పై చర్యలు తీసుకొని, డబ్బులు వెంటనే రికవరీ చేయాలని డివైఎఫ్‌ఐ కంచరపాలెం జోన్‌ కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇలాంటి వారిపట్ల యువకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు పదివేల మంది నుంచి డబ్బులు వసూలు చేశారని వార్తలు వస్తున్నాయని తెలిపారు. నిందితునికి బిజెపి, వైసిపి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని, నిందితులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామి అని అర్థం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బిజెపి విజయనగరం కార్యదర్శి డి.అప్పలాచారి 40 మంది వద్ద స్వయంగా డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్లు స్వయంగానే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విలేజ్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, జిల్లా ఏవో పోస్టులకు రూ.25 వేలు జీతం ఇస్తానని నమ్మించి నిరుద్యోగ యువత నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసి నియామక పత్రాలు అందజేశారని చెప్పారు. నిందితుడు సుధాకర్‌పైనా, ఆ సంస్థ పైనా వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. లేకుంటే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బి.మురళి, పి.రాజశేఖర్‌, పి.విజయ, శరత్‌ పాల్గొన్నారు.