ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎంతో ఘన చరిత్ర కలిగిన కాకినాడ నగరంలో దీర్ఘకాలిక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. స్మార్ట్ సిటీ నగరంగా ఎంపికై సుమారు రూ.1000 కోట్లు నిధులతో అభివద్ధి చేసినా సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. పారిశుధ్య నిర్వహణ నుంచి మొదలుకొని ముంపు సమస్య పరిష్కారం వరకూ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అసౌకర్యాలు నడుమ నగరవాసులు జీవిస్తున్నారు. అధికారుల అలసత్వంతో అల్లాడుతున్నారు.
దాదాపు 4 లక్షల మంది జనాభా నివసిస్తున్న కాకినాడ నగరం 31.69 చ.కిమీ. (50 డివిజన్లు)గా విస్తరించి ఉంది. ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరంగా, పింఛనుదారుల స్వర్గధామంగా నగరానికి పేరుంది. ఇంతలా పేరున్నా పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారింది. ఇక్కడ 100 మురికి వాడలు ఉండగా 300 కిలోమీటర్ల మేర మురుగు నీటి కాలువలు ఉన్నాయి. రోజుకు సుమారు 240 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. గొడారిగుంట, రేచర్లపేట, కొత్త కాకినాడ, సంజరు నగర్, దుమ్ములపేట, పర్లోపేట, చిన్న మార్కెట్ ఏరియా, రామకృష్ణారావుపేట, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంటున్నా అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన స్వప్నికల్ దినకర్ పుండ్కర్ హయాంలో కొంత మెరుగుదల కనిపించినా ఆ తర్వాత నుంచి శానిటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జనాభాకు తగ్గట్టుగా సిబ్బంది లేరు. ప్రతి 100 మందికి ఇద్దరు పారిశుధ్య సిబ్బంది ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం 500 మందికి ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించడం లేదు. ఉన్న వారిలో 100 మంది వరకు అధికారులు, ఇతర ప్రభుత్వ ప్రతినిధుల ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న జనాభాకు 5 వేల మంది సిబ్బంది నియామకం చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల మైదానాల్లో చెత్తలను తరలించకుండా దగ్ధం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఎప్పుడూ శ్మశానం తరహాలో పొగ చూరుతూ ఉంటుంది. లోపలి ప్రాంతాల్లో వారానికి రెండు రోజులు మాత్రమే శానిటేషన్ జరుగుతోంది. ఆరోగ్య విభాగం అధికారి ఎప్పుడూ కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యి ఉంటారు. వంతెనల దిగువన పారిశుధ్య నిర్వహణ చేయడం లేదు. ఇంద్రపాలెం, చీడిగ గ్రామాల చెత్తలను సామర్లకోట రోడ్ కెనాల్ వద్ద మేడలైను వంతెన వద్ద వేస్తుండడంతో సమస్యలు తప్పడం లేదు. తూరంగిలో కాకినాడ నగర డ్రైన్ వ్యర్థాలు చేరడం వల్ల అనారోగ్య బెడద ఎక్కువయ్యింది. బాలయోగి విగ్రహం జంక్షన్ నుంచి మహాలక్ష్మి నగర్ వైపు మేజర్ డ్రెయిన్లు నిర్మిస్తే ఈ బెడద తొలిగే అవకాశం ఉంటుంది. కల్వర్టుల క్లీనింగ్ లేదు. మెయిన్ రోడ్ క్రాస్ కల్వర్టు క్లీనింగ్ చేపట్టడం లేదు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటులను జిల్లాలో ఏర్పాటు చేస్తే నగర గ్రామాల్లో ఉన్న చెత్త బెడద తొలగుతుంది. ఇందుకు ప్రభుత్వ భూములు ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో చిల్లంగి, పెద్దాపురం తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. స్మార్ట్ సిటీ ప్రణాళికలో బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తామని పట్టించుకోవడం మానేశారు.
ముంపు సమస్యతో ఇబ్బందులు
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిస్తే ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. ఏలేరు నుంచి అదనపు జలాలు వదిలినప్పుడు కిర్లంపూడి, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడలోని గాడేరు, ఉప్పుటేరు వరద వచ్చి చేరుతోంది. ఆయా కాలువలు పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు బారిన పడుతున్నాయి. తీర ప్రాంతం ప్రభావంతో బ్యాక్ వాటర్ తోనూ ముప్పు వస్తుంది. దీంతో పాత బస్టాండ్, కచేరిపేట, టీచర్స్ కాలనీ, ట్రెజరీ కాలనీ, జగన్నాథపురంలో పప్పుల మిల్లు ప్రాంతం, వెంకటేశ్వర కాలనీ, తులసి బృందావన్ కాలనీ, ప్రేజరుపేట, గొల్లపేట, జనచైతన్య కాలనీ, పద్మనాభ నగర్, ఎస్.అచ్యుతాపురం, చినస్వామినగర్ తదితర ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి.
ఇంకా అనేక సమస్యలు
కాకినాడ నగర పాలక సంస్థలో అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కౌన్సిల్ కాలం ముగిసినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు.పాలన ఏర్పడి ఏడాది దాటినా సమస్యలు పరిష్కారాల అంశంపై ప్రత్యేక సమావేశం జరగలేదు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విలీన అంశం నేటికీ పరిష్కారం కాలేదు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట గ్రామాలు, టీచర్స్ కాలనీ, గంగనాపల్లి పరిధికి చెందిన 42, 46 డివిజన్ ప్రాంతాల విలీనం కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనధికారిక కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సిటీ ప్లానింగ్‌పై ఎటువంటి అజమాయిషీ జరగడం లేదు. పార్కుల్లో 80 శాతం దీపాలు వెలగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 50 శాతం వీధుల్లో అంధకారం నెలకొంటుంది. పోయిన వాటి స్థానంలో కొత్తవి వేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నులు, వాటి కుళాయి పన్నులు వసూళ్లు సక్రమంగా జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను బకాయి అపరాధ రుసుముతో రూ.50 కోట్లు 2002 నుంచి వసూలు చేయడం లేదు. కేంద్ర కార్యాలయం భవనాల ఆస్తి పన్ను బకాయి రూ.12 కోట్లు ప్రభుత్వ భవనాల కుళాయి పన్ను బకాయి రూ.8 కోట్లు ఉన్నాయి. జనన, మరణ ధవీకరణ పత్రాలను సామాన్యులు చలానా చెల్లింపు పరంగా పొందే వీలులేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. కుళాయి పైపు లైన్ల లీకేజీలు మురుగు కాలువల్లో పైపులైన్లు సరి చేయించే ప్రత్యేక డ్రైవ్ లేకపోవడం వలన అనేక ప్రాంతాల్లో తాగునీరు కొనుక్కుని తాగాల్సి వస్తోంది.










