ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ స్మార్ట్ సిటీలో అభివృద్ధి అరకొరగానే జరుగుతోంది. నిధుల సమస్యతో పలు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఏడాది జూన్‌తో స్మార్ట్ సిటీ మిషన్ ముగుస్తుండగా ప్రతిపాదించిన పనులన్నీ పూర్తవుతాయో లేదోననే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
2016 జూన్‌లో దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఎపి నుంచి మూడు నగరాల్లో కాకినాడ ఒకటి. కేంద్ర ప్రభుత్వం దేశంలోని నగరాలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దేందుకు స్మార్ట్ సిటీల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏటా రూ.200 కోట్లు తగ్గకుండా నిధులు మంజూరవుతాయి. వీటిలో 50 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 20 శాతం. మిగిలిన 30 శాతం నగరపాలక సంస్థ భరించాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థ 31.69 చ.కిమీ. (50 డివిజన్లు)గా విస్తరించి ఉంది. నగరంలో ప్రస్తుతం 4 లక్షల మందిపైనే జనాభా ఉంది. ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరంగా, పింఛనుదారుల స్వర్గధామంగా ఇప్పటికే పేరుంది. సుమారు 101 మురికివాడలు ఉన్నాయి. 300 కిలోమీటర్ల మేర మురుగునీటి కాలువలు ఉన్నాయి. రోజువారీగా సుమారు 300 టన్నుల చెత్త వస్తుంది.
పెండింగ్‌లో 21 పనులు
స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా రూ.1,005 కోట్లు నిధులను ప్రతిపాదించారు. కాకినాడను అన్ని విధాలా అభివద్ధి చేసేందుకు విడతల వారీగా 77 ప్రాజెక్టులను ప్రతిపాదించారు. వీటిలో నిర్ధేశించిన 50 ప్రాజెక్టులు ఎట్టకేలకు పూర్తి కాగా, 6 పనులను రద్దు చేశారు. సకాలంలో బిల్లులు అందని పరిస్థితుల్లో ఇంకా 21 పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా పలు పాఠశాలల అభివద్ధి, రోడ్లు, పార్కులు, స్కిల్ డెవలప్‌మెంట్, సెంటర్ లైటింగ్ సిస్టం, సోలార్ విద్యుత్తు, ఉచిత వైఫై, సిసి కెమేరాల ఏర్పాటు, డిజిటల్ వర్చువల్ క్లాస్ రూముల, మార్కెట్లు, డ్రైన్లు, నూతన బస్ సెల్టర్ల నిర్మాణం, క్రీడా స్థలాల అభివద్ధి, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు తదితర వాటితో పాటు స్మార్ట్ రోడ్ల పనులను కూడా నిర్వహించారు. ఇప్పటికే వివేకానంద, గాంధీ, జన్మభూమి పార్కుల ఆధునీకరణ చేపట్టారు. 38 ప్రాంతాల్లో జిమ్‌ల ఏర్పాటు, రామారావుపేటలో ఇండోర్ షటిల్ కోర్టు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, రోడ్ల అభివృద్ధిని స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టారు. మార్కెట్లలో అభివృద్ధి చేశారు. వాడపేట, పల్లిపేట తదితర మురికివాడలను కొంత వరకూ అభివృద్ధి చేశారు. స్మార్ట్ రహదారి వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు పలు చోట్ల దెబ్బతిన్నాయని అంటున్నారు. నిర్వహణ లేక మరమ్మతులకు గురైనట్టు చెబుతున్నారు. రూ.100 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినా ఏడాది క్రితం మూలకు చేరింది. దీనిలో భాగంగా మెయిన్ సెంటర్లలో సిసి కెమెరాలను, సెన్సార్ ట్రాఫిక్ సిగలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సక్రమంగా పని చేయడం లేదు. గోదావరి కళాక్షేత్రం, సైన్స్ సెంటర్, కన్వర్టబుల్ స్టేడియం, స్కేటింగ్ రింగ్, వ్యాయామ పరికరాల ఏర్పాటు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
అభివద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులను ఏళ్ల తరబడి విడుదల చేయడం లేదు. సుమారు రూ.180 కోట్లు ఇవ్వాల్సి ఉంది. స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి ఏడేళ్లు గడుస్తున్న అభివద్ధి పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పలు పనులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శిస్తున్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కొనసాగుతున్న పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ పూర్తి కావడానికి మరో 7 నెలలు మాత్రమే గడువు ఉండడంతో ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేస్తుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. త్వరితగతిన వాటిని విడుదల చేసి పనులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.