
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించి రైతులపై భారాన్ని మోపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడ్డాయని, తక్షణమే ఈ విధానాన్ని విరమించుకోవాలని సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) నాయకులు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు భట్టిప్రోలు మండలం వెల్లటూరు, పెదపులివరు గ్రామాలలో గురువారం ధర్నా, ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) నాయకులు మురుగుడు సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీ, పి నాగఆంజనేయులు, మర్రివాడ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో లాలూచీపడి ఇప్పటికే 8విడతలుగా వివిధ రూపాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా దోపిడీ చేశారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతులను మోసం చేశాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సామాన్యులను దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అధికారం చేపట్టిటి నుండి రూ.25వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేవరకు దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, కె రామస్వామి, చేనేత నాయకులు దీపాల సత్యనారాయణ, శ్రీనివాసరావు, బట్టు నాగమల్లేశ్వరరావు, సీతారామయ్య, జగ్గారపు కోటేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు పాల్గొన్నారు.