పెట్టుబడిదారీ వ్యవస్థలో పైకి సరుకులు పుష్కలంగా లభిస్తున్నట్టు కనపడినా, ఆ సరుకులను కొనగలిగే కొనుగోలుశక్తి కార్మికవర్గానికి తగినంత లేకపోవడమే అసలు కారణం అని మరిచిపోకూడదు. వారికి తగినంత కొనుగోలుశక్తి లేకపోవడం వలన నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆ నిరుద్యోగం వలన తిరిగి వారి కొనుగోలు శక్తి మరింత తగ్గిపోతుంది. ఇది పెట్టుబడిదారీ విధానానికి గల అనివార్యమైన లక్షణం.
సోషలిస్టు దేశాలుగా ఉన్న కాలంలో సోవియట్ యూనియన్ గురించి, ఇతర తూర్పు యూరప్ దేశాల గురించి చర్చించుకునేటప్పుడు ఆ దేశాలలో చాలా రకాల సరుకుల కోసం వినియోగదారులు పొడవాటి క్యూలలో ఎక్కువ కాలం వేచి వుండవలసి వచ్చేదని చెప్పుకోవడం గుర్తుండే వుంటుంది. సోషలిస్టు వ్యవస్థను తూలనాడే పశ్చిమ దేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషలిస్టు ఉత్పత్తి వ్యవస్థÛ యొక్క అసమర్ధత కారణంగానే ఈ విధంగా క్యూలలో ఉండవలసి వస్తున్నదని, అదే పెట్టుబడిదారీ దేశాలలోనైతే ఎవరైనా, ఏ సూపర్ మార్కెట్‌లోకైనా యథేచ్ఛగా పోయి కావలసిన సరుకునల్లా కొనుక్కురావచ్చునని ప్రచారం చేసేవారు.
నిజానికి సోషలిస్టు దేశాల లోని పొడవాటి క్యూలు అసమర్ధతకు సూచికలు కావు. సోషలిస్టు సమ భావన స్వభావానికి అవి ప్రతిబింబాలు. అదే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొనివుండే తీవ్ర అసమాన ఆదాయాల కారణంగానే ఆ దేశాలలో సరుకులు యథేచ్ఛగా దొరుకుతాయి. ఈ అంశాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. అందుకోసం ఆదాయాల పంపిణీలో తప్ప తక్కిన అన్ని అంశాలలోనూ ఒకే విధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలను తీసుకుందాం.
'ఎస్' అనే ఆర్థిక వ్యవస్థ సోషలిజంలో ఉన్నది. 'సి' అనే ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నది. ఈ రెండూ తలా ఇరవై యూనిట్ల సంపదను పెట్టుబడి పెడతాయి. రెండూ తలా వంద యూనిట్ల సంపదను ఉత్పత్తి చేస్తాయి. 'ఎస్' లో 20 శాతంగా ఉన్న సోషలిస్టు అధికార వర్గం 30 శాతం సంపదను తమ అందుబాటులో ఉంచుకుని 80 శాతం కార్మికులకు తక్కిన 70 శాతం సంపదను విడిచిపెడతాయి. అదే 'సి' లో 20 శాతం గా ఉన్న పెట్టుబడిదారులు, అధికారులు తమ వద్ద 60 శాతం సంపదను ఉంచుకుని 80 శాతం కార్మికులకు తక్కిన 40 శాతం సంపదను విడిచిపెడతాయి. ఈ రెండు వ్యవస్థల లోని పైస్థాయి వర్గాలు తమ ఆదాయాలలో సగం మాత్రం ఖర్చు చేస్తాయి. రెండు వ్యవస్థల లోనూ కార్మికులు తమ పూర్తి ఆదాయాలను ఖర్చు చేస్తారు.
'ఎస్' లో పై వర్గాల ఆదాయంలో 50 శాతం అంటే 30 లో సగం-15, కార్మికవర్గం ఆదాయం మొత్తం నూరు శాతం అంటే 70 కలిపి మొత్తం వినిమయం డిమాండ్ 85 అవుతుంది. దీనికి ఆ ఏడాది పెట్టుబడి 20 కూడా కలిపితే 105 అయింది. ఇది ఆ వ్యవస్థలో మొత్తం డిమాండ్ (అగ్రిగేట్ డిమాండ్) అవుతుంది. అదే 'సి' లో పైవర్గాల ఆదాయంలో 50 శాతం - 30, కార్మికవర్గం మొత్తం ఆదాయం 40 కలిపితే వినిమయం డిమాండ్ 70 అవుతుంది. దీనికి ఆ ఏడాది పెట్టుబడి 20 కూడా కలిపితే మొత్తం డిమాండ్ 90 అవుతుంది. అంటే 'ఎస్' లో ఉత్పత్తి కన్నా 5 శాతం అధికంగా డిమాండ్ ఏర్పడింది. అదే 'సి' లో మాత్రం ఉత్పత్తి కన్నా 10 శాతం తక్కువగా డిమాండ్ ఏర్పడింది.
డిమాండ్ తగ్గిపోయింది కనుక 'సి' లో ఇక పూర్తిస్థాయి ఉత్పత్తి చేయరు. ఈ మారు 66 2/3 మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి అయ్యే సంపదలో గత నిష్పత్తి ప్రకారమే (పెట్టుబడిదారులకు, అధికారులకు 60, కార్మికులకు 40) పంపిణీ జరిగితే ఈ మారు పెట్టుబడిదారులకు, అధికారులకు 40, కార్మికులకు 26 2/3 వంతున వాటాలు వస్తాయి. ఈ మారు వినిమయం 46 2/3 అవుతుంది (పెట్టుబడిదారుల వాటాలో సగం 20, కార్మికుల పూర్తి వాటా 26 2/3). దీనికి ఈ ఏడాది పెట్టుబడి 20 కలిపితే మొత్తం 66 2/3 అవుతుంది. పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు గనుక ఉన్న ఉపాధి అవకాశాలలో మూడవ వంతు తగ్గిపోతాయి. దాంతో భారీగా నిరుద్యోగం పెరుగుతుంది. ఇక సరుకుల కొరత ఉండే ప్రసక్తి లేదు. అదనపు డిమాండ్ తలెత్తే ప్రసక్తి అసలే లేదు. అందుచేత 'సి' వ్యవస్థలో వినియోగదారులు దర్జాగా వారికి నచ్చిన సూపర్ మార్కెట్ కు పోయి తోచిన సరుకులను కొనుక్కురావచ్చు (వారి దగ్గర ధనం ఉండాలి అంతే). సరుకుల కోసం క్యూలు ఏర్పడే పరిస్థితి తలెత్తదు.
'ఎస్' వ్యవస్థ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పూర్తి సామర్ధ్యం కన్నా అదనంగా 5 యూనిట్ల అదనపు డిమాండ్ ఏర్పడింది. పూర్తి సామర్ధ్యం మేరకు 100 యూనిట్లు ఉత్పత్తి ఔతాయి. కాని అదనంగా ఏర్పడిన 5 యూనిట్ల డిమాండ్ ను సర్దుబాటు చేయడమెలా ? తేలిక మార్గం ఒకటుంది. అదే ధరలను పెంచెయ్యడం. దానివలన కొందరు వినియోగదారుల నిజ కొనుగోలు శక్తి 5 యూనిట్ల మేరకు తగ్గిపోయి ఉత్పత్తికి సమంగా డిమాండ్ సర్దుబాటు ఔతుంది. ఆ విధంగా గనుక చేస్తే దానివలన ఎక్కువగా ఆ భారం కార్మికులపైన పడుతుంది. వారి వద్ద అదనపు నగదు నిల్వలు ఉండవు. అంటే కార్మికుల ప్రయోజనాలను దెబ్బ తీసి తద్వారా అదనపు డిమాండ్ సమస్యను పరిష్కరించడం ఔతుంది. కాని దానికి బదులు ఇంకో మార్గం ఉంది. అన్ని తరగతుల వారికీ ఒకే మోతాదులో వినిమయాన్ని తగ్గించేటట్టు నియంత్రించడం. ఇదే మెరుగైన పద్ధతి. అందుకే సోషలిస్టు వ్యవస్థలు ఆ మార్గాన్ని అనుసరించాయి. ధరలను స్థిరంగా ఉంచుతూనే సరుకుల రేషనింగ్ ప్రవేశ పెట్టాయి. ఆ విధంగా అదనంగా తలెత్తిన 5 యూనిట్ల డిమాండ్‌ను సర్దుబాటు చేశాయి. ఈ రేషనింగ్ అమలు జరిగింది కనుకనే ప్రజలు క్యూలు కట్టవలసి వచ్చింది.
సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలలో క్యూలు ఉండడం అనేది ఆ వ్యవస్థ యొక్క అసమర్ధత వలన కాదు. ఆ వ్యవస్థ ఆదాయాల పంపిణీలో అసమానతలను పెరగకుండా తగ్గించడానికి ప్రయత్నించడం వల్లనే ఆ విధంగా జరుగుతుంది. ఈ అసమానతలను సోషలిస్టు వ్యవస్థలో రెండు విధాలుగా తగ్గించే ప్రయత్నం చేస్తారు. మొదటిది: సంపద పంపిణీలో సాధ్యమైనంత తక్కువ తేడాలు ఉండేవిధంగా చూడడం, రెండవది: ఆ విధంగా చూసినా అదనపు డిమాండ్ తలెత్తితే దానిని సర్దుబాటు చేయడానికి ధరలను పెంచి కార్మిక వర్గాన్ని నష్టపరచడం కాకుండా ధరలను స్థిరంగా ఉంచి సరుకుల రేషనింగ్ అమలు చేయడం. ఈ రేషనింగ్ కారణంగానే క్యూలు కట్టవలసి వస్తుంది.
ఇటువంటి విధానాన్ని సోషలిస్టు వ్యవస్థలో అమలు చేసే క్రమంలో కొన్ని చిక్కులు వచ్చాయి. కొరత వున్న సరుకులను ప్రభుత్వ అధికారులు, లేదా పార్టీ నాయకులు ముందుగా దొరకబుచ్చుకోవడం, ''ఎవరు ముందు వస్తే వారికే'' అన్న విధానాన్ని అమలు చేయడం ద్వారా కొరత ఉన్న సరుకుల పంపిణీ హేతువిరుద్ధంగా, ఒక పద్ధతి లేకుండా జరగడం వంటివి చూశాం. ఐతే, ఈ లోపాలను బట్టి అసలు విధానాన్నే తప్పు బట్టడం సరికాదు. ఆదాయాల పంపిణీలో సమ ధర్మం పాటించే క్రమంలోనే సరుకుల కొరత ఏర్పడిందన్న మౌలిక వాస్తవాన్ని విస్మరించకూడదు. అదే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో పైకి సరుకులు పుష్కలంగా లభిస్తున్నట్టు కనపడినా, ఆ సరుకులను కొనగలిగే కొనుగోలుశక్తి కార్మికవర్గానికి తగినంత లేకపోవడమే అసలు కారణం అని మరిచిపోకూడదు. వారికి తగినంత కొనుగోలుశక్తి లేకపోవడం వలన నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆ నిరుద్యోగం వలన తిరిగి వారి కొనుగోలు శక్తి మరింత తగ్గిపోతుంది. ఇది పెట్టుబడిదారీ విధానానికి గల అనివార్యమైన లక్షణం.
హంగేరీ దేశంలో సోషలిస్టు విధానం అమలు జరుగుతున్నప్పుడు దానిని తీవ్రంగా విమర్శించిన వారిలో ఆ దేశపు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జానోస్ కొర్నారు ఒకరు. ''సాంప్రదాయ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడూ తగినంత డిమాండ్ ఉండదు. అదే సాంప్రదాయ సోషలిస్టు వ్యవస్థలో ఎప్పుడూ తగినంత వనరులు ఉండవు'' అని ఆయన అన్నాడు. అంటే సోషలిజంలో మొత్తం కార్మిక శక్తితోబాటు అన్ని వనరులనూ పూర్తిగా ఉపయోగిస్తారు అని అర్ధం. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో ఆ కారణాన్ని ఆయన ఈ విధంగా వివరించాడు: సోషలిజంలో పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది గనుక అవి ఖర్చు చేసే దగ్గర బడ్జెట్‌కు యథాతథంగా కట్టుబడి వ్యవహరించకుండా కొంత అదనంగా పెట్టుబడి కింద ఖర్చు చేస్తారు. ఆ పెట్టుబడి మీద తిరిగి రాబడి ఏ మేరకు రాబోతోంది అన్న అంశాన్ని వారు అంత శ్రద్ధగా పట్టించుకోరు. అదే పెట్టుబడిదారీ విధానంలోనైతే పెట్టుబడి పెట్టే ప్రతీ పైసాకూ వారు ఆచితూచి వ్యవహరిస్తారు.
ఈ వాదన వాస్తవం కావచ్చు. కాని, పెట్టుబడిదారీ విధానంలో ఎల్లప్పుడూ డిమాండ్ తక్కువగా ఉండడానికి, సోషలిజంలో ఎప్పుడూ వనరులు తక్కువగా ఉండడానికి మరో ముఖ్యమైన, బలమైన కారణం ఉంది. సోషలిజంలో ఆదాయాల పంపిణీలో ఎక్కువ మోతాదులో సమానత్వాన్ని పాటించడమే ఆ కారణం. ఏదైనా ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ (అగ్రిగేట్ డిమాండ్) అనేది, విదేశీ వాణిజ్యాన్ని కాసేపు పక్కన పెడితే, రెండు అంశాలతో కూడి వుంటుంది. ఒకటి: పెట్టుబడి మోతాదు. రెండవది: వినిమయం మోతాదు. ఆదాయంలో ఎంత ఎక్కువ శాతం ఖర్చు చేయగలిగితే అంత ఎక్కువగా ఈ వినిమయం మోతాదు పెరుగుతుంది. పెట్టుబడి పెట్టే విషయంలో కొర్నారు వివరణ వర్తిస్తుందేమో కాని ఈ రెండవ అంశం-వినిమయం మోతాదు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సోషలిజంలో వచ్చే ఆదాయాలలో ఖర్చు అయ్యేది ఎక్కువ శాతం ఉంటుంది (ఎక్కువ శాతం ఆదాయం కార్మికులకు పోతుంది. వారు తమ ఆదాయాలను పూర్తిగా ఖర్చు చేస్తారు). కనుక పెట్టుబడి ఏ స్థాయిలో పెట్టినా, మొత్తం డిమాండ్ ఎప్పుడూ ఉత్పత్తి కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ కీలకమైన అంశాన్ని కొర్నారు గుర్తించడంలో విఫలమయ్యాడు.
సోవియట్ యూనియన్ లోను, తూర్పు యూరప్ లోను సోషలిజం కూలిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ప్రస్తావించడం వలన ప్రయోజనం ఏమిటి ? ఆ సోషలిస్టు వ్యవస్థలకు ఎన్ని పరిమితులు ఉన్నా, ఆ వ్యవస్థలలో మాత్రమే, తక్కిన అన్ని రకాల వ్యవస్థలకు భిన్నంగా, గత రెండు వందల ఏళ్ళ కాలం అంతా చూసుకుంటే, పూర్తి స్థాయి ఉద్యోగాల కల్పన సాధ్యపడింది. వాటి స్వభావ రీత్యానే పెట్టుబడిదారీ దేశాలు పూర్తి స్థాయి ఉపాధి కల్పన చేయలేవు. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థల నడక వేరే ప్రాతిపదికన ఉంటుంది గనుక అవి నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపాయి. ఆ విధంగా చేయగలిగిన ఆర్థిక వ్యవస్థలు ఒకప్పుడు ఉండేవి అన్న విషయాన్ని మనం ఎప్పుడూ విస్మరించకూడదు.
భారత దేశం వంటి మూడవ ప్రపంచ దేశాలలో ఒకప్పుడు అమలు జరిగిన 'ప్రభుత్వ నియంత్రణ లోని ఆర్థిక విధానానికి'', ఇప్పుడు నడుస్తున్న నయా ఉదారవాద విధానానికి మధ్య తేడా కూడా సోషలిస్టు విధానానికి, పెట్టుబడిదారీ విధానానికి మధ్య ఉన్న తేడా మాదిరిగానే చాలా ఎక్కువ. ఈ మూడవ ప్రపంచ దేశాలు పూర్తి స్థాయి ఉపాధి కల్పన ఎక్కడా సాధించలేదు కాని, ఆదాయాల పంపిణీ లో మాత్రం ప్రభుత్వ నియంత్రణ లోని ఆర్థిక విధానాలు అమలు జరిగిన కాలంలో పరిస్థితి మెరుగ్గా ఉండేది. అందువల్లనే ఆ కాలంలో మొత్తం డిమాండ్ ఉత్పత్తి కన్నా ఎక్కువ అయిన సందర్భాలు ఎదురయ్యాయి. చాలా వస్తువుల పంపిణీ మీద ఆంక్షలు విధించవలసి వచ్చేది. ఇవే దేశాలు నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం ప్రారంభించాక ఎక్కడా సరుకుల కొరత మనకు కనిపించదు. కాని ఇందుకు కారణం విపరీతంగా ఆదాయాల పంపిణీలో పెరిగిన వ్యత్యాసాలు, పర్యవసానంగా పడిపోయిన శ్రామికవర్గ ప్రజల కొనుగోలుశక్తి అన్నది మరిచిపోకూడదు. 1982 నాటికి జనాభా లోని అతి సంపన్నులు గా ఉన్న ఒక శాతం జనాభా జాతీయ ఆదాయంలో తమ వాటా 6 శాతం మాత్రమే కలిగివుండేవారు. 2013 వచ్చేసరికి వారి వాటా కాస్తా అమాంతం 22 శాతానికి ఎగబాకింది. గత శతాబ్దం లోనే ఇది అతి ఎక్కువ పెరుగుదల. అందుచేత భారతదేశంలో ధరల పెరుగుదలకు కారణం జనం దగ్గర డబ్బు ఎక్కువైపోవడం కాదు. సామాన్యులు ఉపయోగించే సరుకులపై ప్రభుత్వమే అదనంగా పన్నులను పెంచుతూ పోవడమే ధరల పెరుగుదలకు దారితీస్తున్నది. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల సంపదపై గాని, వారి లాభాలపై గాని పన్నులను ఏ మాత్రమూ పెంచడం లేదు.
ఇలా ప్రభుత్వం పెంచిన పన్నుల వలన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగిపోతే, దానిని అదుపు చేయడానికి ద్రవ్య నియంత్రణ విధానాలను అమలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం. దీని వలన ధరలు తగ్గవు సరికదా, నిరుద్యోగం మాత్రం మరింత తీవ్రంగా పెరుగుతుంది. భారతదేశ ప్రభుత్వం ఇటువంటి మతిమాలిన విధానాన్ని అమలు చేయడంలోనే తలమునకలై వుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్











