Aug 17,2023 22:17

కదిరిలో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని మున్సిపల్‌కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా వైసిపి ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మున్సిపల్‌ కార్మికులందరికీ వర్తింపజేయాలని, మున్సిపల్‌ కార్మికులు ఏదైనా ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం చెల్లించి, వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 24న చలో విజయవాడ కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘం అధ్యక్షులు జనార్ధన, జిల్లా కోశాధికారి తిరుపాలు, సూరి, చిన్నకృష్ణ, నరసింహమూర్తి, రామాంజులు, రాజు, సిఐటియు నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌, ముస్తాక్‌ అలీ, కృష్ణ నాయక్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించక పోతే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలన్ని ముట్టడిస్తామని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి జగదీష్‌ హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు, ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు స్కిల్‌, సెమీస్కిల్‌ వేతనాలను అమలు, సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌ కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌ సర్కిల్‌లో మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు క్లాప్‌ డ్రైవర్లకు రూ.18500 వేతనం ఇవ్వాలన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలన నేరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున, కోశాధికారి ఆనంద్‌, రామచంద్ర, రామంజప్ప, మంజునాథ్‌, గుర్నాథ్‌, చంద్ర, నరసింహమూర్తి, శివ కుమార్‌, శంకర, నాగేంద్ర, బాబయ్య, బాలాజీ, కవిత, ఓబులమ్మ, క్లాప్‌ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ హనుమాన్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడి కార్మికులు నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు యూజీడి కార్మికులకు హెల్త్‌ రిస్క్‌ అలయన్స్‌ ఇవ్వాలని గ్రాడిటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ ఆటో డ్రైవర్లకు 18500 రూపాయల వేతనం ఇవ్వాలని, పెండింగ్‌ లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, సిఐటియు నాయకులు పైపల్లి గంగాధర్‌, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు గోవిందు, నాగార్జున, నరసింహులు, సాయి, రామాంజనేయులు, రామయ్య, రమణ, గణేష్‌, నాగరాజు, పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.