ప్రజాశక్తి-గుంటూరు : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా అన్నారు. స్థానిక సంఘం కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్‌బాషా మాట్లాడుతూ ఏ ప్రభుత్వ విభాగంలో చూసినా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారని, రోజురోజుకీ వారిపై పనిభారం పెరుగుతోందని చెప్పారు. అయితే వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఒకే చోట, ఒకే పనికి రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మద్య వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉండడం బాధాకరమన్నారు. ఒకే విద్యార్హతతో ఒకే పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన వ్యత్యాసాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వమే అమలు చేయకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోరాటాల ద్వారా హక్కులు, సమాన వేతనం సాధించుకునేందుకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కరిముల్లా షాఖాదరి, ఉపాధ్యక్షులు మహేష్‌బాబు, హుస్సేన్‌ఖాన్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, నగర ఉపాధ్యక్షులు రాధాకృష్ణ పాల్గొన్నారు.










