జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కొన్ని రాష్ట్రాలు సమర్పించిన శకటాల ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించిన తీరు...బిజెపి పాలకుల ధోరణిని, వారి ఆలోచనా విధానాన్ని వెల్లడిస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల శకటాల తిరస్కరణతో ఫెడరలిజం భావనను, స్వాతంత్య్ర పోరాట సామాజిక, సాంస్కృతిక సాంప్రదాయాలను ఘోరంగా ధిక్కరించినట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాది పరేడ్ థీమ్ (ప్రధాన అంశం) 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం. అందుకు అనుగుణంగా, స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఎ) సాగించిన పాత్రను ప్రముఖంగా పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ శకట ప్రతిపాదనను అందచేసింది. దీన్ని కేంద్రం తిరస్కరించింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వి.ఓ.చిదంబరం, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జాతీయ కవి సుబ్రమణ్య భారతీయార్ తదితరులతో కూడిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కూడా ఆమోద ముద్ర లభించలేదు.
కేరళ శకటాన్ని తిరస్కరించడం మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది. కులానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ పోరాట యోధుడు, సంఘ సంస్కర్త నారాయణ గురు విగ్రహంతో కేరళ శకటాన్ని రూపొందించింది. కాని ఆ స్థానంలో ఆది శంకరాచార్య విగ్రహాన్ని పెట్టాల్సిందిగా నిపుణుల కమిటీ కోరినట్లు తెలియవచ్చింది. అయితే నారాయణ గురు విగ్రహానికే కేరళ ప్రభుత్వం కట్టుబడడంతో పరేడ్ లోకి ప్రవేశమే లేకుండా పోయింది.
పునరుజ్జీవనోద్యమానికి, స్వాతంత్య్ర ఉద్యమానికి ఎనలేని సేవలందించిన ఇరవయ్యవ శతాబ్దికి చెందిన సంఘ సంస్కర్త కన్నా...బ్రాహ్మణీయ వ్యవస్థను లేదా పరంపరను పునరుద్ధరించిన 8వ శతాబ్దికి చెందిన మతాచార్యుడు ఎలా కీలకమయ్యాడు? హిందూత్వం కరుడు కట్టిన పాలకులు మాత్రమే దీన్ని వివరించగలరు. కేరళ శకటంపై ఆదిశంకరాచార్య విగ్రహమే వుండాలని నిపుణుల కమిటీ పట్టుబట్టడమంటే నారాయణ గురును అవమానించడం మాత్రమే కాదు. మొత్తంగా కేరళ ప్రగతిశీల సామాజిక, సాంస్కృతిక సాంప్రదాయాలను కించపరచడమే కాగలదు.
తమ శకటాలను పరేడ్ నుండి మినహాయించిన తీరు పట్ల పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు నిరసన తెలియచేస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. అందుకు సమాధానంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ వైఖరిని సమర్ధించుకున్నారు. ఇందుకోసం ఒక స్పష్టమైన వ్యవస్థ వుందని, శకటాల ఎంపిక కూడా సక్రమంగానే వుందని చెప్పుకున్నారు. కళలు, సంస్కృతి, సంగీతం, వాస్తుశిల్పం వంటి రంగాలలో ప్రముఖులైన వ్యక్తులతో ఏర్పడిన నిపుణుల కమిటీ ఈ శకటాలను ఎంపిక చేస్తుందని చెప్పారు. అయితే, ఈ రిపబ్లిక్ దినోత్సవ ఇతివృత్తానికి ఆదిశంకరాచార్య మరింతగా అతికినట్టు సరిపోతారని భావించే నిపుణులు ఎవరో చెబితే బావుణ్ణు.
కేంద్ర ప్రజా పనుల విభాగం (సి.పి.డబ్ల్యు.డి) కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ శకటాన్ని రూపొందించిందని రాజ్‌నాథ్ సింగ్ తన లేఖలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి తెలియచేశారు. అదే గనుక నిజమైతే, నేతాజీ వంటి ప్రసిద్ధ స్వాతంత్య్రోద్యమ నేత ఇతివృత్తంతో తయారుచేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కన్నా ఒక కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రాధాన్యత ఇచ్చారని అర్ధమవుతోంది.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణి, ఒంటెత్తువాద దృక్పథం...ఈ గణతంత్ర దిన్సోతవ పరేడ్‌లో మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లేకుండా పోవడానికి దారి తీసింది. ప్రతిపక్షాలు పాలనలో వున్న మూడు రాష్ట్ర ప్రభుత్వాల శకటాలను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరించడం చూస్తుంటే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫెడరల్ వ్యతిరేక వైఖరి వెల్లడవుతోంది. జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా మారి, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పలు రాష్ట్రాల యూనియన్‌గా భారతదేశాన్ని రాజ్యాంగం నిర్వచించింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగం లోని ఈ మౌలిక భావననే తీవ్రంగా ఉల్లంఘిస్తోంది.
( 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం )










