Jan 10,2022 18:46

లక్నో :  యుపిలో కాంగ్రెస్‌ కీలక నేత ఇమ్రాన్‌ మసూద్‌ సమాజ్‌వాది పార్టీలో చేరనున్నారు. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యుపిలో ప్రియాంకగాంధీ పార్టీకి ఎదురుదెబ్బ కానుంది. అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ మాత్రమే బిజెపి ఓడించగలదని మాజీ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ మసూద్‌ పేర్కొన్నారు. మసూద్‌కి ఆ ప్రాంతంలో అధిక ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా అక్కడ జనాభాలో 42 శాతంగా ఉన్న ముస్లింలు ఆయనకి మద్దతుదారులుగా ఉన్నారు. ఈ సందర్భంగా షహరాన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన నేతలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. లక్నోలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌తో సమావేశం కానున్నానని, ఆయన నాయకత్వంలో మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. తన కుటుంబం కూడా తనకు అండగా ఉంటుందని, త్వరలోనే అఖిలేష్‌ పార్టీలో చేరతానని, దీనికి మీరు మద్దతు తెలుపుతారా అని తన మద్దతుదారులనుద్దేశించి ప్రశ్నించారు. యుపిలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మనమంతా అఖిలేష్‌ యాదవ్‌కి మద్దతునివ్వాలని అన్నారు. కాగా, 2007 ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచిన మసూద్‌ అనంతరం 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో 2013లో సమాజ్‌వాది పార్టీలో చేరారు. 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ తరపున పోటీకి దిగినప్పటికీ... రెండింటిలోనూ ఓటమి పాలయ్యారు.