
ప్రజాశక్తి-గుంటూరు : సమాజం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులు, సామాజిక బాధ్యతను తలకెత్తుకున్న రచయితలు రాసే పుస్తకాలను గ్రంథాలయాల్లో వుంచితే అవి చదువుకున్న పాఠకులు కూడా గొప్ప వ్యక్తులుగా రూపొందుతారని, కావున కవులు, రచయితలు మంచి పుస్తకాలను లైబ్రరీలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ- బాపు రమణ బాలు కళాపీఠం నిర్వహించిన కవిమిత్రుల సంగమం - కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కవులు, రచయితల్నే కాదు విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా గ్రంథాలయానికి రప్పించేందుకు గ్రంథాలయ వ్యవస్థలో కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు పోతున్నామన్నారు. కోట లీలాకృష్ణ రచించిన 'బ్రతుకు బాణీలు' నానీల పుస్తకాన్ని ఒఎస్‌డి టు చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సుప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం.ప్రభాకర్ ఆవిష్కరించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ఆధునిక సాహిత్యంలో గొప్ప ప్రక్రియగా పేరొందిన 'నానీ'లవెంట పడుతున్న 'గోపీ'లోలుర లిస్టులో లీలాకృష్ణ చేరిపోయారన్నారు. సభకు అధ్యక్షత వహించిన బాపు రమణ బాలు కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ తొలి పుస్తకంగా నానీలను ప్రచురించిన లీలాకష్ణను అభినందించారు. నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ కొత్త కవుల్ని ప్రోత్సహించి, సమాజంలో వారికి ఉన్నత స్థానాన్ని కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ప్రతీ నెలా కవిమిత్రుల సంగమం-కవిసమ్మేళనం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 'బ్రతుకు బాణీలు' నానీల పుస్తకాన్ని కవి, రచయిత లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం సమీక్షించారు. అనంతరం సయ్యద్ జానీబాషా నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆళ్ళ నాగేశ్వరరావు, కారంచేటి విజరు కుమార్, విష్ణుమొలకల భీమేశ్వరప్రసాద్, డాక్టర్ బలరామ్ పెరుగుపల్లి, పింగళి భాగ్యలక్ష్మి, చల్లా సత్యవతి, సౌపాటి ప్రభాకర్, గడల శివప్రసాద్, వెదుళ్ళపల్లి సాంబశివరావు తమ కవితల్ని వినిపించారు. కనగాల జయకుమార్ రాసిన కవితకు ఉత్తమ బహుమతి ప్రకటించి, నగదు బహుమతితో సత్కరించారు.