ప్రజాశక్తి -ములగాడ : జాతీయ సేవా పథక కార్యకర్తలు సమాజంలోని వివిధ వర్గాలను, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని, వారితో మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాలని జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్ భాగ్యలక్ష్మి సూచించారు. జాతీయ సేవా పథక సీనియర్ కార్యకర్తలకు శిక్షణను ఇస్తూ.. సమాజంలోకి ఎలా వెళ్లాలి? ప్రజలను ఎలా సమీకరించాలి? ప్రజలకు అర్థమయ్యే భాషలో సామాజిక సమస్యలపై ఎలా వివరించాలి? అనే అంశాలపై అవగాహన కల్పించారు. సమాజంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచర్లను, లాయర్లను, డాక్టర్లను, కుల పెద్దలను, సామాజిక కార్యకర్తలను కలుసుకొని వారి సహకారంతో ముందుకు సాగాలని చెప్పారు. తన చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన లేకపోతే విద్య వృథా అవుతుందన్నారు. అనంతరం జాతీయ సేవా పథకంలోని జాతీయస్థాయి అవకాశాలపై సీనియర్ ప్రోగ్రాం అధికారి వై.అనసూయాదేవి, ప్రత్యేక సేవా శిబిరాల నిర్వహణపై సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల యూనిట్ -1 ప్రోగ్రాం అధికారి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజానికి తీసుకోవలసిన చర్యలపై యూనిట్- 2 ప్రోగ్రాం అధికారి నదియా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సేవా శిబిరాలలో పాల్గొన్న సీనియర్ వాలంటీర్లకు యోగ్యతా పత్రాలను అందించి అభినందించారు.










