
ప్రజాశక్తి-కె.కోటపాడు
పిల్లలే మన ఆస్తి అని, వారిని సమాజానికి ఉపయోగపడే ఆస్తిలా పెంచాలని పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. స్థానిక అయ్యన్న స్కూల్లో శనివారం యుకెజి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తొలి గురువులైన తల్లిదండ్రులు ఆదిశంకరాచార్యులవారి తల్లిదండ్రులలాంటి త్యాగనిరితిని కలిగి ఉండాలన్నారు. ఎంత కాలం జీవించామని కాకుండా ఎంత బాగా బతికామన్నదే ముఖ్యమన్నారు. డాక్టరు అంబేద్కర్ చెప్పినట్టుగా గొప్పగా జీవించాలన్నారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మాలిని మాట్లాడుతూ విలువైన బాల్యం పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ద తీసుకోవాలని సూచించారు. రేపటి పౌరులైన నేటి బాలలు భవిష్యత్‌లో ఎలాంటి మానసిక దౌర్బల్యానికి గురికాకుండా వారితో స్నేహ పూర్వక వాతావరణంలో మెలగాలని సూచించారు. అందుబాటు ఫీజులతో పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న అయ్యన్న విద్యాసంస్థల అధినేత డాక్టరు ఖాసీంను అభినందించారు. అనంతరం యుకెజి చిన్నారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఎలిమెంటరీ, హైస్కూల్ విద్యార్థులలో పలు విభాగాలలో ఉత్తమ విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ హరీష్, ఉపాధ్యాయులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.