Sep 15,2023 22:01

ప్రయోగశాలను పరిశీలిస్తున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
   విద్యార్థులతో కలిసి ఫొటో దిగిన సిఎం జగన్‌
 విద్యార్థులతో కలిసి ఫొటో దిగిన సిఎం జగన్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  గొప్ప వైద్యులుగా గుర్తింపు పొంది, సమాజానికి అంకిత భావంతో సేవలందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అకాంక్షించారు. ప్రతి కుటుంబానికీ వైద్యసేవలందిచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. విజయనగరం మెడికల్‌ కళాశాలను ప్రత్యక్షంగాను, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల మెడికల్‌ కళాశాలలను వర్చువల్‌ పద్ధతిలోనూ శుక్రవారం ఆయన ప్రారంభించారు. తొలుత కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు. అనంతరం లెక్చర్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేస్తున్న ప్రభుత్వం మనదేనని అన్నారు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పిహెచ్‌సి వైద్యులు వెళ్తారని, తద్వారా రానున్న 6 నెలల్లో పేదలకు మంచి వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని తెలిపారు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జిఎంపి, డబ్ల్యూహెచ్‌ఒ ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. తొలుత కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రారంభోపన్యాసం చేశారు. వైద్య కళాశాలతో జిల్లా వాసులకు మరింతగా మెరుగైన వైద్యం అందడంతో పాటు విద్యార్థులకు రాష్ట్రం లో మొత్తం 2550 మెడికల్‌ సీట్లు అందు బాటులో కి వచ్చాయని, దీనితో మరింత మంది పేద విద్యార్థులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ డిసెంబర్‌ నాటికి మొత్తం భవనాలు పూర్తవుతాయని తెలిపారు. 22 డిపార్ట్మెంట్లలో 174 పోస్టులు కూడా మంజూరయ్యాయని అన్నారు.
ప్రయోగశాలలను ఆసక్తిగా తిలకించిన సిఎం
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ ప్రయోగశాలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి తిలకించారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను విని, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వైద్య కళాశాలలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విటి కృష్ణబాబు, ఎపిఎంఎస్‌ఐడిసి ఎమ్‌డి మురళీధరరెడ్డి సిఎంకు వివరించారు. అనంతరం సిఎం స్కిల్‌ ల్యాబ్‌ను సందర్శించారు. వివిధ వైద్య పరమైన అంశాలను ప్రొఫెసర్లు సిఎంకు ప్రయోగాత్మకంగా వివరించారు. సిఎం వెంట డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిఎస్‌యుఎల్‌ నర్సింహం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల, ఆసుపత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ అప్పలనాయుడు ఉన్నారు.
సిఎంకు ఘన స్వాగతం
జిల్లాకు వచ్చిన సిఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. సిఎం జగన్‌ తాడేపల్లి నుంచి విశాఖ వరకు విమానంలోను, విశాఖ నుంచి విజయనగరం జెఎన్‌టియు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ హెలీక్యాఫ్టర్‌లోనూ చేరుకున్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి , ఎస్‌పి దీపికా, డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కొంతమంది నేతలు దుశ్శాలువలతో సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు సురేష్‌ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్‌, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసు, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, సంబంగి చిన వెంకట అప్పలనాయుడు, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి, అలజంగి జోగారావు, కళావతి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డివిజి. శంకరరావు, అవనాపు భావన, విక్రమ్‌, డిసిసిబి చైర్మన్‌ చిన రామునాయుడు, జిల్లా అధికారులు ఉన్నారు.