Aug 23,2023 18:27

ప్రజాశక్తి - కాళ్ల
            మండలంలోని కోపల్లె గ్రామానికి చెందిన సమాజ సేవకుడు, అంబేద్కర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.నిరీక్షణరాజుకు గోవా రాష్ట్రంలోని సన్‌రైజ్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అవార్డును ఈ నెల 21న సోమవారం అందుకున్నారు. తన సంపాదనలో కొంతైనా సామాజిక, ఆధ్యాత్మిక సేవకు హెచ్చించాలనే దృక్పాథంతో ఆక్వా కార్మికులకు పేదలకు తన వంతు సాయం చేస్తున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి గోవాలోని సన్‌రైజ్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ అవార్డును ప్రదానం చేసింది. నిరీక్షణరాజు స్వతహాగా మృదు స్వభావి. ఆయన ఆక్వా రంగంలో లేబర్‌ కాంట్రాక్టర్‌గా స్థిరపడి, కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందిస్తూ, గత 15 ఏళ్లుగా ఆక్వా రంగంలో రాణిస్తున్నారు. కోపల్లె గ్రామంలో అంబేద్కర్‌ అభ్యుదయ భావాలు ఉండడంతో గ్రామంలో అంబేద్కర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిఏటా అంబేద్కర్‌ జయంతి, వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ తన వంతు సహకారం అందిస్తున్నారు. నిరు పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నియోజకవర్గస్థాయి వాలీబాల్‌ పోటీలు 2022లో ఘనంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ప్రతిఏటా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆక్వా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కరోనా మొదటి, రెండు దశల్లో వందలాది మంది కార్మికులకు రూ.లక్షల విలువైన కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారు. కరోనా, లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వందలాది మంది ఆక్వా కార్మిక కుటుంబాలకు, పలు గ్రామాల్లో పేదలకు ఆర్థిక సహకారం అందించారు. డి.నిరీక్షణ రాజు చేస్తున్న సేవలను గుర్తించి గోవాలోని సన్‌ రైజ్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ అవార్డును ప్రదానం చేసింది. డాక్టరేట్‌ అందుకోవడం పట్ల కోపల్లె గ్రామస్తులు, ఆక్వా కార్మికులు నిరీక్షణరాజును అభినందిస్తున్నారు.