Sep 05,2023 23:38

లక్ష్మణరావు మస్టారును సన్మానిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం: 
మొదటి గురువు తల్లి అని, భావితరాలకు ఉత్తమ స్థానం గురువుదేనని, సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు.ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్‌ కళావేదికలో మంగళవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. పురస్కార గ్రహీతలకు, ఉపాధ్యాయులకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టిని మలచి ఒక విగ్రహం చేసినట్లు పిల్లలను ఉత్తమ విద్యను అందించి వారు ఉన్నత స్థానానికి చేరుకునేలా తీర్చిదిదాలన్నారు. చిన్నతనంలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు నేటికీ మనకి గుర్తుంటాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ వారి నుండి మారంత నేర్చుకోవచన్నారు. మనందరిలోనూ ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తనకు విద్యానభ్యసించిన గురువులకు జ్ఞప్తికి తెచ్చుకొన్నారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అడుగుజాడల్లో నడవాలని, మీ వద్ద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిదాలని ఆకాంక్షించారు. ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యంపై వారికి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఉప విద్యాశాఖధికారి తిరుమల చైతన్య తరగతిగది ప్రముఖ్యత వివరించారు. బలగ పాఠశాల విద్యార్థిని నందిని మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవిస్తే మనలో ఒక మంచి మార్పు వస్తుందన్నారు. అనంతరం 39 మంది పాధ్యాయులకు దుశ్శాలువ కప్పి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ముందుగా డాక్టర్‌ నీరజా సుబ్రమణ్య అధ్వర్యాన విద్యార్థినులు పలు నృత్యరూపకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్‌ ఎపిసి డాక్టర్‌ ఆర్‌.జయప్రకాష్‌, డిసిఇబి సెక్రెటరీ రాజేంద్రప్రసాద్‌, ఉప విద్యాశాఖధికారి పగడాలమ్మ పాల్గొన్నారు.