Nov 12,2022 23:48

చెట్లు తొలగిస్తున్న పంచాయతీ అధికారులు

ప్రజాశక్తి-అనకాపల్లి : ఆరేడు దశాబ్ధాలుగా తాము వేసుకున్న పశువుల పాకలను కనీసర సమాచారం లేకుండా పంచాయతీ అధికారులు తొలగించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తుమ్మపాల మెయిన్‌ రోడ్‌లో చెరువును ఆనుకొని సుమారు 25 కుటుంబాలు పాకలు వేసుకుని పాడిపశువులతో జీవిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుకు స్థలం కోసం అందులో ఒకరిద్దరి స్థలాన్ని శనివారం అధికారులు ఖాళీ చేయించారు. అయితే గ్రామంలో పంచాయతీకి చెందిన భూమి ఉండగా, తమ అధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వం అధికారులు ఖాళీ చేయించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయితీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు వివరణ కోరగా ఆర్‌డిఒ ఆదేశాలతోనే ఈ స్థలంలో రైతు భరోసా కేంద్రం, లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూమి కోల్పోయిన వారికి నివాస స్థలాన్ని కేటాయిస్తామన్నారు.