
ప్రజాశక్తి - మండవల్లి
ప్రజల చేతుల్లో ఉన్న తిరుగులేని అస్త్రం సమాచార హక్కు చట్టం అని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్.భాస్కరరావు తెలిపారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శోభనాద్రిపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గ్రామసభలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్ధేశంతో అవినీతి అంతమొందించేందుకు రూపొందించిన చట్టమే సమాచార హక్కు చట్టమని ఆయన తెలిపారు. దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక చట్టం సమాచార హక్కు చట్టమన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా సమాచారం కోరేందుకు ఈ చట్టం హక్కును కల్పించాలన్నారు. ఈ చట్టాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల చట్టాన్ని తీసుకువచ్చి, 18 సంవత్సరాలు గడిచినా, సమాచార హక్కు చట్టంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోలేకపోయారని, అందువల్లే చట్టాన్ని సమగ్రంగా వినియోగించుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. ఈ చట్టంపై అవగాహన పెంచుకొని అవినీతిని అంతమొందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం మండల అధ్యక్షులు తింటూ అప్పారావు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.